పుంగనూరులో విధ్వంసం …

-ప్రజల ఉల్లాసానికి షాక్‌…
– అర్ధరాత్రి ఇండోర్‌ స్టేడియం నేలమట్టం
-చందాలతో నిర్మించిన స్టేడియం కూల్చివేతపై జనాగ్రహం
-రూ.80 లక్షల ఆస్తి నష్టం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

చిన్న…పెద్ద తేడా లేకుండ ప్రతి ఒక్కరి మానసిక ఉల్లాసం కోసం వినియోగించుకుంటున్న ఇండోర్‌ స్టేడియంను అర్ధరాత్రి కూల్చివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం పుంగనూరు ఫ్రెండ్స్ షెటిల్‌ అసోసియేషన్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు చందాలు వేసుకుని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇలా ఉండగా ఆదివారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు హిటాచిలు, జెసిబిలతో కూల్చి, విధ్వంసం సృష్టించండంతో రూ.80 లక్షలు విలువ చేసే భవనం నేలమట్టమైంది. ఈ సంఘటన పట్టణంలో దావానలంలా వ్యాపించింది. దీనిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

నిర్మాణం….

పుంగనూరు సమీపంలోని ఎంబిటి రోడ్డులో గల ప్రభుత్వ స్థలంలో షెటిల్‌ కోర్టు నిర్మించేందుకు సంఘప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌, హరిప్రసాద్‌, రాజారెడ్డి, అనిల్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. పట్టణ ప్రజల రిక్రియేషన్‌కు ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తామని, ఇందుకోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వే నెంబరు:225/6లో 17 సెంట్ల భూమిని 10-9-2004లో సంఘం పేరున పట్టా మంజూరు చేశారు. దీనిపై అనుమతులు పొందిన సంఘ ప్రతినిధులు ఆనాడు సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేసి స్టేడియంను నిర్మించారు. తిరిగి మరో రూ.50 లక్షలు ఖర్చు చేసి అధునాతన వసతులతో ఇండోర్‌ స్టేడియంను నిర్మించారు.

అందరికి అందుబాటులో ….

పుంగనూరులో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరికి అందుబాటులో ఉండేలా సంఘ సభ్యులు చర్యలు చేపట్టారు. గత ఐదేళ్ల క్రితం అధునాతన వసతులతో , నేలపై చెక్కపలకలతో క్రీడాకారులకు బాక్సులు సిద్ధం చేశారు. రంగుల మ్యాట్‌లు వేశారు. ఎల్‌ఈడి దీపాలు, మంచినీరు ఏర్పాటు చేశారు. రాత్రి , పగలు పోటీలను నిర్వహిస్తూ పట్టణ యువతి, యువకులకు ఇండోర్‌ స్టేడియం పుట్టినిల్లుగా మారింది. ఇక్కడ షెటిలు, స్నూకర్స్, క్యారమ్స్, చెస్‌ ఇలా అన్ని రకాల ఆటలకు స్టేడియం వేదికగా మారింది. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఇండోర్‌ స్టేడియంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 200 మంది యువతి, యువకులు, వృద్ధులు, ఇతర ప్రభుత్వ అధికారులు తమకు నచ్చిన ఆటలను ఆడుకోవడం అలవర్చుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు…

అర్ధరాత్రి ఇండోర్‌ స్టేడియంను కూల్చివేసి ,రూ.80 లక్షల మేరకు ఆస్తి నష్టం కలిగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని షెటిల్‌ సంఘ ప్రతినిదులు డాక్టర్‌ శరణ్‌, సిఎస్‌.రాజారెడ్డి, అనిల్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి, హరిప్రసాద్‌, మునిరాజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలమనేరు డిఎస్పీ విష్ణురఘువీర్‌ , సీఐ కృష్ణారెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు.

స్టేడియంతో ఎవరికి నష్టం ….

ప్రభుత్వ అనుమతితో స్థలాన్ని పొంది, సుమారు రూ.80 లక్షలు ఖర్చుతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియంతో ఎవరికి నష్టంలేదని సంఘ ప్రతినిధులు డాక్టర్‌ శరణ్‌, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, అనిల్‌కుమార్‌, మునిరాజ లు వాపోయారు. ప్రజల మానసిక ఉల్లాసం కోసం ఎలాంటి స్వార్థము లేకుండ నిర్మించిన స్టేడియంను అర్ధరాత్రి కూల్చివేయడం బాధకరమన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

విధ్వంసాన్ని అణచివేస్తాం…

పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంను కూల్చివేసిన వారు ఎవరైన క్షమించేది లేదని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప హెచ్చరించారు. ఈ విషయమై పోలీసులు తక్షణమే నిందితులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి , పట్టణ ప్రజలలో భయాన్ని పోగొట్టి, భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Tags:Vandalism in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *