Natyam ad

వందే భారత్ కు భారీగా ఆదరణ

విజయవాడ ముచ్చట్లు:


సంక్రాంతి కానుకగా.. ఏపీ-తెలంగాణ మధ్య పట్టాలెక్కిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ ట్రైన్‌లో.. సగటున 140 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోందని అధికారులు వెల్లడించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 17 వరకు.. 29 ట్రిప్పుల్లో.. సికింద్రాబాద్‌-విశాఖపట్నం రైల్లో 47వేల 55 మంది.. విశాఖపట్నం-సికింద్రాబాద్‌  రైల్లో 44వేల 938 మంది ప్రయాణించారు.ఇటు సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సగటున ఒక ట్రిప్‌లో 1,623 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో అత్యధికంగా సికింద్రాబాద్‌ నుంచి 1,099 మంది, విజయవాడలో 341 మంది, వరంగల్‌లో 76, ఖమ్మంలో 55 మంది ఈ రైలు ఎక్కుతున్నట్టు గుర్తించారు. రాజమండ్రి నుంచి 52 మంది ప్రయాణిస్తున్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌లో సగటున ఒక ట్రిప్‌లో 1,550 మంది ప్రయాణిస్తున్నారు.

 

 

 

అత్యధికంగా విశాఖపట్నంలో 1,049 మంది, విజయవాడలో 297, రాజమండ్రిలో 138, వరంగల్‌లో సగటున 24, ఖమ్మంలో 41 మంది ఈ రైలు ఎక్కుతున్నారని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు.సికింద్రాబాద్‌-విశాఖపట్నం రైలు కంటే.. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైలులో ప్రయాణికుల రద్దీ కొంత తక్కువగా ఉంటోందని గుర్తించారు. విశాఖపట్నం నుంచి ఈ రైలు తెల్లవారుజామున 5.30 గంటలకే బయల్దేరుతుంది. అంత పొద్దున రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు.. కాస్త లేటుగా బయల్దేరే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవారు.. ముందురోజు రాత్రే విశాఖ చేరుకొని తెల్లవారుజాము వరకు ఎదురుచూడటం ఇబ్బందిగా మారుతోంది. దీంతో వేరే ట్రైన్లలో వస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల ఆదరణ బాగుంటుందని చెబుతున్నారు.

 

Post Midle

Tags: Vande Bharat is hugely popular

Post Midle