బెజవాడలో వంగవీటి రాధా షో…

Vangavati Radha Show in Bejawada ...

Vangavati Radha Show in Bejawada ...

-రంగా వర్ధంతి రోజే నిర్వహణ
Date:24/11/2018
విజయవాడ ముచ్చట్లు:
వంగవీటి రాధా తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యరా? తన వెనక ఎంతమంది ఉన్నారో చెప్పే ప్రయత్నంలో ఉన్నారా? ఇటు సొంత పార్టీ అగ్రనేతలకు, అటు ప్రత్యర్థి పార్టీ నేతలకు తాను, తన వెనక ఎవరు ఉన్నారన్నది నిరూపించి సత్తా చాటుకోనున్నాడా? అవును. వంగవీటి రాధా ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. వంగవీటి రాధా గత రెండు నెలల నుంచి సైలంట్ గా ఉన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను ఆశించారు.
అయితే వంగవీటి రాధాను కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. వంగవీటి రాధా కంటే మల్లాది విష్ణుకే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వే నివేదికలు అందడంతో రాధాను సెంట్రల్ నుంచి తప్పుకుని తూర్పు నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయడం ఇష్టం లేకపోతే బందరు పార్లమెంటు నుంచైనా పోటీ చేయవచ్చని ఆప్షన్ ఇచ్చారు. అయితే రాధా మాత్రం తాను సెంట్రల్ నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టారు.అధిష్టానం కూడా ఏమాత్రం వెరవకుండా బందరు పార్లమెంటు ఇన్ ఛార్జిగా బాలశౌరిని నియమించింది.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సయితం వంగవీటి రాధాతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా రాధాకు మాత్రం సెంట్రల్ నియోజకవర్గం నుంచి మనసు మరలడం లేదు. మరోవైపు సెంట్రల్ లో మల్లాది విష్ణు తన పనితాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో రాధా తన నిర్ణయాన్ని ప్రకటించడానికి, తన బలమేందో నిరూపించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకోసం వేదిక, డేట్ కూడా ఫిక్సయ్యాయి.వంగవీటి రంగా వర్థంతి వచ్చే నెల 26వ తేదీన జరగనుంది. ఎప్పుడూ బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించే రాధా ఈసారి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రంగా చనిపోయి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. ఇప్పటికీ రంగా అభిమానులకు కొదవలేదు.
రాష్ట్రం నలుమూలల నుంచి రంగా అభిమానులను ఒకచోట చేర్చి తన సత్తా చాటాలనుకుంటున్నారు రాధా. ఇందుకోసం రంగా వర్థంతిని భారీ ఎత్తున చేయాలని నిర్ణయించారు. రంగా, రాధా మిత్రమండలి, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. బహిరంగ సభకు రంగానాడుగా నామకరణం చేయనున్నారు.ఇందుకోసం గుంటూరుకు సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద స్థలాన్ని కూడా పరిశీలించారు. దీన్నే ఖరారు చేయనున్నారు.
ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు సామాజికవర్గం నేతలను రప్పించాలన్న రాధా ప్రయత్నిస్తున్నారు. రంగా వారసుడిగా ఈ సభే తన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని రాధా నమ్ముతున్నారు. ఈ సభ ద్వారా తన బలమేంటో ఇటు జగన్ కు, అటు ప్రత్యర్థి పార్టీలకూ చూపించాలని రాధా తహతహలాడుతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు రాధా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఆ రోజుల రాధా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనన్నది ఉత్కంఠగా మారింది.
Tags : Vangavati Radha Show in Bejawada …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *