ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం – జెఈవో వీరబ్రహ్మం
– నేరుగాను, వర్చువల్‌గాను పాల్గొనే అవకాశం
– భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు
తిరుపతి ముచ్చట్లు:

భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పర్వదినాల్లో ఒకటైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 5వ తేదీ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని జెఈవో వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై సోమవారం జెఈవో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులు నేరుగాను, వర్చువల్ గాను వ్రతంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు జారీ చేస్తామన్నారు. ఆలయం, ఆస్థాన మండపంలో వివిధ రకాల పుష్పాలలు, విద్యుత్ అలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారన్నారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు జరిగే వరలక్ష్మీ వ్రతాన్నిఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఎస్ఇలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రవాణావిభాగాధిపతి శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, విజివో మనోహర్, ఇఇలు నరసింహమూర్తి, మనోహర్, స్థానిక సి ఐ సుబ్రహ్మణ్యం రెడ్డి , ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు ఉన్నారు.
Tags: Varalakshmi Vrat on 5th August – JEO Veerabraham
