Natyam ad

వాసు దెబ్బ… కార్పొరేటర్లు దూరం

విశాఖపట్టణం ముచ్చట్లు:


విశాఖ నగర పరిధిలోని దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, కార్పొరేటర్ల మధ్య వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహారశైలితో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఉన్న మరికొంత మంది కార్పొరేటర్లు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన చేరారు గానీ స్థానిక కార్పొరేటర్లు మాత్రం ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ వీరి మధ్య వివాదం మరింత పెరుగుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లితో విబేధించిన కొందరు కార్పొరేటర్లు ఇప్పటికే జనసేనలో చేరారు. మరికొందరు ఆయనకు దూరంగా ఉంటూ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఇంకొంత మంది వాసుపల్లికి టికెట్‌ ఇస్తే సహకరించేది లేదంటూ మరికొందరు ప్రకటించారు.

 

 

 

ఇవన్నీ ఇప్పుడు పార్టీ హైకమాండ్‌కు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లితో కార్పొరేటర్లకు ముందు నుంచీ వివాదం ఉంది. కార్పొరేటర్లు అంతా వైసీపీ నుంచి గెలిచారు. వీరంతా ముందు నుంచీ వైసీపీతో కలిసి పయనిస్తున్నారు. వాసుపల్లి వైసీపీలోకి వచ్చిన తరువాత ఆయన వెంట వచ్చిన టీడీపీ వాళ్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నారంటూ కార్పొరేటర్లు అలకబూనారు. అనేక సందర్భాల్లో అధిష్టానం వీరి మధ్య ఏకాభిప్రాయాన్ని కుదుర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వివాదం మరింత పెరగడంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందు నుంచీ వాసుపల్లిని వ్యతిరేకిస్తున్న వారిలో మహ్మద్‌ సాదిక్‌, కందుల నాగరకాజు జనసేన పార్టీలో చేరిపోయారు. మిగిలిన వాళ్లు పార్టీలో ఉన్నప్పటికీ వాసుపల్లికి వ్యతిరేకంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇరువర్గాల మధ్య దూరం మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తాజాగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను విజయవాడకు పిలపించి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో వైసీపీ అధిష్టానం ఏం చెప్పిందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. వాసుపల్లితో విబేధిస్తున్న వారంతా పార్టీకి దూరంగా వెళుతున్నారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేసి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన సీతంరాజు సుధాకర్‌ కొద్దిరోజుల కిందటే పార్టీని వీడారు. ఇద్దరు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

 

 

 

Post Midle

ఇంకా వైసీపికి తొమ్మిది మంది కార్పొరేటర్లు ఈ నియోజకవర్గంలో మిగిలి ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా వాసుపల్లిని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. నాలుగు రోజులు కిందట వాసుపల్లిపై మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేసిన నలుగురు కార్పొరేటర్లను పార్టీ సస్పెండ్‌ చేసింది. దీనివల్ల మిగిలిన కార్పొరేటర్లు సైలెంట్‌గా ఉంటారని భావించారు. కానీ, మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 19న ఎమ్మెల్యే వాసుపల్లి తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఒకే ఒక్క కార్పొరేటర్‌ హాజరయ్యారు. మిగిలిన వాళ్లంతా గైర్హాజరు కావడంతో వివాదం మరింత ముదిరినట్టు అధిష్టానానికి అర్థమైంది.

 

 

 

ఈ నేపథ్యంలోనే వాసుపల్లిని విజయవాడకు పిలువగా, ఆయన మంగళవారం వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గంపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ఎమ్మెల్యే వాసుపల్లి పట్ల సానుకూలంగా లేకపోయినప్పటికీ అధిష్టానం తనకే టికెట్‌ ఇస్తుందని ఆయన తన అనుయాయులు వద్ద చెబుతున్నారు. సీటు తనకే కన్ఫార్మ్‌ అయిందని, పని చేసుకోవాలని ఆయన తన వర్గీయులకు సూచించినట్టు తెలిసింది. వ్యతిరేక వర్గం మాత్రం వాసుపల్లికి టికెట్‌ ఇస్తే పని చేసేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం దక్షిణ నియోజకవర్గంలో రాజుకున్న ఈ అగ్గిని ఎలా ఆర్పుతుందో చూడాల్సి ఉంది. మరి కొద్దిరోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండనున్న తరుణంలో ఈ రచ్చ ఎవరికి మేలు చేస్తుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

 

Tags: Vasu hit… corporators away44

Post Midle