గుంటూరు జిల్లాల్లో బలమైన అభ్యర్ధుల కోసం వైసీపీ 

VCP for strong candidates in Guntur districts

VCP for strong candidates in Guntur districts

Date:12/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
ఏపీలో గుంటూరు జిల్లా వైసీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి అంచనాలకు, ఊహలకు అందని విధంగా ఇక్కడ జగన్‌ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చేస్తున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌తో ప్రారంభం అయిన నియోజకవర్గ సమన్వయకర్తల మార్పున‌కు బ్రేకులు లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. చిలకలూరిపేటలో వైసీపీ సమన్వయకర్తను మార్చినప్పుడు అక్కడ రాజశేఖర్‌ అభిమానులు, వైసీపీలో చాలా మంది కార్యకర్తలు పార్టీపై అసమ్మ‌తి బావుటా ఎగరవేశారు. తర్వాత సద్దుమణిగింది. తర్వాత వారం రోజులు క్రితం గుంటూరు వెస్ట్‌ సమన్వయకర్తగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని మార్చి మాజీ పోలీస్‌ అధికారి చంద్రగిరి యేసురత్నంను నియమించారు.
దీంతో అక్కడ అప్పిరెడ్డి అనుచరులు సైతం నానా రభసరభస చేశారు. ఆ తర్వాత అప్పిరెడ్డి చల్లబడ్డారు.ఈ మార్పులు ఇలా ఉండగా గత మూడున్నర ఏళ్లుగా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసిన లావు శ్రీ కృష్ణదేవరాయులను అనూహ్యంగా నరసారావుపేటకు మార్చారు. ఈ మార్పులు ఇలా ఉండగానే తాజాగా ఇప్పుడు నెక్ట్స్‌ వికెట్‌ తాడికొండ సమన్వయకర్త కత్తెర హెన్రీ క్రిస్టియానానే అని తెలుస్తోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన క్రిస్టియానాను తప్పించడానికి దాదాపు రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఓడిపోయినా నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠం చేసుకుంటూ వస్తున్న క్రిస్టియానాకు బదులుగా హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న శ్రీదేవికి త్వ‌రలోనే తాడికొండ నియోజకవర్గ పగ్గాలు అప్పగించనున్నారు.
గుంటూరు లలితా హాస్పటల్‌ అధినేత డాక్టర్‌ లలిత‌ సిఫార్సులు మేరకే తెర వెనుక ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.వేమూరులో గత రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్న మేరుగు నాగార్జున కంటే ఆర్థికంగా మరో బలమైన వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతుంది. మేరుగు నాగార్జునకు నాడు వైఎస్‌ తర్వాత జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్న మేరుగ‌ నాగార్జునకు షాక్‌ తప్పదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక సత్తెనపల్లి సమన్వయకర్తగానూ ఉన్న నరసారావుపేట పార్లమెంట‌రీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అబంటి రాంబాబును సైతం మార్చేయనున్నారట. ఇటీవల సమీక్ష సమావేశంలో జగన్‌ అంబటిపై నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠపరచలేదని రుసరుసలాడినట్టు తెలిసింది. ఇక్క‌డ‌ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతుంది.
ఇక నియోజకవర్గాల ఇన్‌చార్జులకే షాకుల కాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను సైతం ఒకరిద్దరిని పక్కన పెట్టనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడమా లేదా ఆయనను సత్తెనపల్లికి మార్చడమో చేస్తారని సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్త‌ఫా టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ రాయపాటికి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు ఆయన ఇటీవల తరచూ సీఎం చంద్రబాబును కలవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జగన్‌ ఆయనకు బదులుగా మరో అభ్యర్థి కోసం అన్వేషణ చెయ్యమని జిల్లా పార్టీ న్యాయకత్వానికి సూచించారు. గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు అంత ఇష్టత చూపడం లేదు.క్రిస్టియానా తర్వాత నెక్ట్స్‌ వికెట్‌ కచ్చితంగా పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడే అన్నది దాదాపు గ్యారెంటీ అంటున్నారు.
ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ఢీ కొట్టడం కావటి మనోహర్‌నాయుడు వల్ల సాధ్యం కాదని గ్రహించిన జగన్‌ ఆయనను తాత్కాలిక ఇన్‌చార్జ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. ఆయనకు బదులుగా తుళ్లూరు మండలం పెద‌ప‌రిమి గ్రామానికి చెందిన నంబూరి శంకర‌రావు పేరు రేపో మాపో ఖ‌రారు కానుందని తెలుస్తోంది. అలాగే పెదకూరపాడులో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకరిద్దరు ఎన్నారైల పేర్లు కూడా పార్టీ చర్చల్లో ఉన్నాయి. పెదకూరపాడు తర్వాత వినుకొండ ఇన్‌చార్జ్‌ బొల్లా బ్రహ్మనాయుడు కూడా అదే రూట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
వినుకొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులును ఢీ కొట్టలేరని డిసైడ్‌ అయిన వైసీపీ అధిష్టానం ఆయనకు బదులుగా గుంటూరులో ఓ డాక్టర్‌ పేరును పరిశీలిస్తుంది. బ్రహ్మనాయుడికి సైతం చూచాయిగా సంకేతాలు అందడంతో ఆయన అధిష్టానం నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడే కంటిన్యూ అవుతారా లేదా నరసారావుపేటకు మారతారా అన్నది తెలియని పరిస్థితి. గుంటూరు జిల్లా వైసీపీలో చాలా మంది నియోజకవర్గ సమన్వయకర్తలకు మరిన్ని షాకులు అయితే తప్పవని దాదాపు స్పష్టం అయ్యింది.
Tags:VCP for strong candidates in Guntur districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *