తెలంగాణ బరిలో వైసీపీ

VCP in Telangana

VCP in Telangana

Date:19/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ సారి జరిగే ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు, వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై దృష్టి సారించిన వైసీపీ అధిష్ఠానం.. ఈ సారి అక్కడ ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
అందుకోసం గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన వైసీపీ.. కొద్దిరోజుల్లో మిగతా వారి పేర్లను కూడా ప్రకటించబోతుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ రూపంలో ప్రమాదం పొంచి ఉన్నా.. తమ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును నమ్ముకుని ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగేందుకు పరితపిస్తోంది. మరోవైపు, విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో బలంగానే కనిపించిన వైసీపీ.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆతృత అందరిలో కనిపిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కొంత ప్రభావం చూపగలిగింది. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో 92 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది.
ఈ మూడు స్థానాలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనివే. ఏపీకి సరిహద్దు జిల్లా కావడం వల్లే అక్కడ వైసీపీ ప్రభావం కనిపించింది. ఇక పక్కా తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ కొన్ని చోట్లు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు వైసీపీ అధిష్ఠానం దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కాకపోయినా, కొన్నింటిలోనైనా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే వారు తెలంగాణలో కూడా ఉన్నారని ఆ పార్టీ నమ్ముతుందట. అయితే, వైసీపీలోని కొందరు నేతలు మాత్రం పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకని, అదేదో ఏపీ ఎన్నికలపైనే ఫోకస్ చేద్దామని జగన్‌తో చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
Tags:VCP in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *