మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి వేదాలు మార్గదర్శకాలు – టీటీడీ ఛైర్మన్
మహామహోపాధ్యాయ శ్రీ చిర్రావూరి “పంచదశ కర్మలపై” ఉపన్యాసం
తిరుపతి ముచ్చట్లు:

మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రబోధించే పవిత్ర గ్రంథాలు వేదాలు అని టీటీడీ ఛైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం తిరుమలలోని నాద నీరాజన వేదికపై శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస వేద విద్వత్ సదస్సు ప్రారంభోత్సవానికి ఛైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందన్నారు. వేద ప్రామాణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని తెలిపారు. “వేదాలు ఏ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కావాని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, మానవీయ విలువలతో సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సనాతన హైందవ ధర్మంలో బోధించిన సిద్ధాంతాలను అనుసరించాలి” అని ఆయన వివరించారు.
ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ వేదాలు బోధించే “పంచాదశ సంస్కారాల” ప్రాముఖ్యతను గురించి ఉపన్యాసిస్తూ, వేదం అజ్ఞానంలో ఉండే మానవుడిని విజ్ఞానం వైపు నడిపించడంతో పాటు సంస్కారం అందించి, సర్వోన్నతుడైన మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:Vedas are the guidelines for living a righteous life for the human race – TTD Chairman
