Natyam ad

నాటి “వీరగల్లు” నేటి బెంగళూరు–బండారు రామ్మోహనరావు.  

బెంగుళూరు నగరానికే “కెంపు” కెంపేగౌడ.

కెంపేగౌడ నాటిన మొక్క నేటి మహావృక్షం.

 

బెంగుళూరు ముచ్చట్లు:

Post Midle

నవంబర్ 11న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు కెంపేగౌడ 108 అడుగుల విగ్రహాన్ని మోడీ ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం.బెంగళూరు మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న కెంపేగౌడ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 11న ఒక్కలిగ జాతికి చెందిన బెంగళూరు నిర్మాత కెంపేగౌడ గౌరవార్థం 108 అడుగుల విగ్రహాన్ని నవంబర్ 11న ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన బెంగళూరు నగరానికి అంకురార్పణ చేసిన విధానం మనం స్మరించుకోవాలి. 16వ శతాబ్దంలోనే 1537లో ఒక మట్టి కోట నిర్మించడం ద్వారా బెంగళూరు మహానగరానికి కెంపేగౌడ పునాది వేశారు. ఆనాడు ఆయన నాటిన మొక్క ఇవాళ మహావృక్షమై బెంగళూరు సిటీ దేశంలోనే “సిలికాన్ వాలీ”గా పేరుపొందింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన,చెందుతున్న నగరంగానే కాకుండా భారతదేశంలో అతి త్వరలో జనాభాలో మూడవ మహానగరంగా మారబోతుంది. ఈ సందర్భంగా బెంగళూరు నగరానికి అంకురార్పణ చేసిన కెంపేగౌడ గురించి తెలుసుకుందాం.

 

 

 

కెంపెగౌడ బెంగళూరు నగర నిర్మాత. ఆయన1533-1569 వరకు శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. కొందరు ఆయనను పాలెగాడు అని కూడా పిలుస్తారు. కర్ణాటకలో గౌడ చరిత్ర లో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తిగా ఆయన పేరు మీదనే ఇప్పటికి బెంగుళూరు బస్సు స్టేషన్ తో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు.ఇప్పటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆయన 27 జూన్ 1510 లో “మగాడి”అనే గ్రామంలో జన్మించారు. 1569లో ఆయన “కేన్పుపుర” అనే గ్రామంలో మరణించారు. 60 ఏళ్లు నిండకుండానే షష్టిపూర్తి కాకుండానే ఆయన మరణించినా ఆయన నాటిన బెంగళూరు మొక్క నేడు ఎంతోమంది భారతీయులకు ఉపాధి కల్పిస్తుంది. ఆయన నిర్మించిన మట్టి కోట నేడు బెంగళూరు పోర్టుగా పిలుస్తున్నారు. ఆ తర్వాత రాజులు దాన్ని తిరిగి నిర్మించి ఆధునికరించారు.బెంగళూరు నగర నిర్మాత గానే కాకుండా అందులో అనేక చారిత్రక నిర్మాణాలను కూడా ఆయన ఆనాడే ప్రారంభించి పూర్తి చేశారు. ఆయనకు ముందు విజయనగర సామ్రాజ్యానికి వారి తండ్రిగారైన “కెంపేనంజే గౌడ” పాలెగాడుగా ఉండేవారు ఆయన తర్వాత ఆయన వారసులుగా గిడ్డే గౌడ విజయనగర సామ్రాజ్యంలో సామంత రాజుగా కొనసాగారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కెంపేగౌడ ఈ ప్రాంతానికి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు.

 

 

నాటి (గండుభూమి) వీరభూమి నేటి బెంగళూరు.

కెంపెగౌడ అంతకుముందు ఈ ప్రాంతానికి పాలగాడుగా ఉన్న గంగరాజును ఓడించడానికి విజయనగర సామ్రాజ్యం తో జతకట్టి అతని ఓడించి కంచికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత బెంగుళూరులో మట్టి కోటను నిర్మించారు. కెంపేగౌడ పోరాట శౌర్యానికి,శక్తికి భయపడ్డ ఆనాటి విజయనగర సామ్రాజ్య అధినేత అచ్యుత దేవరాయలు బెంగళూరు గా చెప్పబడుతున్న ప్రాంతంలో రాతికోట నిర్మాణానికి కెంపేగౌడకి అనుమతి ఇవ్వలేదు. అందుకే మట్టి కోట మాత్రమే నిర్మించి సరిపెట్టుకున్నారు. అలా కెంపేగౌడ తన కొత్త పట్టణాన్ని “గండుభూమి” లేదా వీరభూమిగా పేర్కొన్నాడు. కోట లోపల పట్టణం చిన్న చిన్న విభాగాలుగా విభజించబడి ఉండేది.ప్రతి ఒక్క విభాగానికి కన్నడ భాషలో “పీట్”అని పిలుస్తారు. పట్టణంలో ప్రధానంగా రెండు వీధులు ఉండేవి. ఒకటి చిక్కపేట వీధి మరొకటి దొడ్డపేట వీధి. నేటికీ బెంగుళూరు నడిబొడ్డులో చౌరస్తాగా ఈ వీధి ఉంది. అలాగే బెంగుళూరు సరిహద్దులను గుర్తించే నాలుగు టవర్లను కూడా ఆయన నిర్మించారు. విజయనగర పాలెం లో అనేకమంది సాధువులు మరియు కవులు బెంగళూరు ను దేవరాయ నగర, మరియు కళ్యాణపుర, కళ్యాణపురి అని కూడా పేర్కొన్నారు. ఆనాడు బెంగళూరు సరిహద్దు నిర్ణయించడానికి కెంపెగౌడ నిర్మించిన నాలుగు టవర్లు పట్టణ విస్తరణ వల్ల నేడు బెంగుళూరులో నగరం మధ్యలో ఉన్నాయి. వాటిని అప్పటి స్మారక చిహ్నాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ టవర్లలో మొదటిది లాల్బాగ్ ఉద్యానవనంలో ఒక చివర పురాతన ద్వీపకల్ప గ్నిస్ రాక్ పై ఉంది.మిగిలిన మూడు టవర్లు “మైక్రి సర్కిల్లో” ఒకటి, ఉల్సూర్ సరస్సు పక్కన మరొకటి “కంపాబుధి” సరస్సు పక్కన చివరి టవర్ ఉన్నాయి.

 

 

దొడ్డ బసవడి గుడి.

దక్షిణ బెంగళూరు నగరంలో దొడ్డ బసవడ గుడిగా పిలవబడే నందీశ్వరుడి వృషబాలయం కూడా కెంపే గౌడ నిర్మించినదే.ఎన్ ఆర్ కాలనీలో ఉన్న ఈ బసవ గుడిలో నందీశ్వరుడు ప్రధాన దైవం. హిందూ పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుడికి వాహనమే కాక పరమ భక్తుడు. నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతిపెద్దదైన ఈ ఆలయాన్ని 1537లో కెంపేగౌడ నిర్మించారు. ద్రావిడ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవు ఉండే ఈ నందీశ్వర విగ్రహాన్ని ఏకశిల గ్రైనేట్ రాయితో మలిచారు. ఈ నంది పాదాల వద్ద నుండే విశ్వభారతి నది పుట్టిందని ప్రతీతి. ఈ ఆలయం క్షేత్ర చరిత్ర ప్రకారం ఆలయ పరిసర ప్రాంతాలలో అప్పట్లో విస్తృతంగా వేరుశనగ పంట పండించే వారని చెబుతారు. ఆ వేరుశెనగ పంటను ప్రతి రోజు తినేస్తూ వచ్చిన ఓ పెద్ద వృషభాన్ని శాంతింప చేసేందుకు ఈ గుడి కట్టారనేది కూడా ఒక చరిత్ర. అందుకే ఈ కథకు స్మారకంగా ఇప్పటికీ నవంబర్,డిసెంబర్ నెలలో స్థానికులు కన్నడ భాషలో పిలిచే “కడలేకయి పరిషే”తెలుగులో “వేరుశనగ పండుగ” అనే పేరుతో పండుగను నిర్వహిస్తారు. వేరుశనగ పంట అప్పుడే చేతికి వస్తుంది కనుక ఈ గుడిని దర్శించాలంటే ఇదే మంచి సమయంగా భావిస్తారు. వృషభ ఆలయం సమీపంలోనే దొడ్డ గణేశ ఆలయం ఉంది.

 

 

ఉల్సూర్ చెరువు.

బెంగళూరు నగర స్థాపనలో నగరానికి ఈశాన్యంగా ఎంజీ రోడ్డుకు దగ్గరలో ఉల్సూరు చెరువు కూడా కెంపేగౌడ నిర్మించారు. సుమారు ఒకటిన్న చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండే ఈ చెరువులో అక్కడక్కడ చిన్నచిన్న దీవులు ఉంటాయి. శ్రావణ భాద్రపద మాసాలలో ఇక్కడ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. ఈత కోసం ఈతకొలను లాంటి అనేక వినోద కార్యక్రమాలకు ఒక ప్రత్యేక కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఉంది.ఉల్సూర్ చెరువుకు దగ్గరలో ఉన్న గురుద్వారా బెంగళూరు నగరంలోని అతిపెద్దది. ఈ చెరువులో బోట్ షికారు చేయవచ్చు. మధ్యలో ఉన్న దీవులలో ఆగడానికి బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి.మూడు ప్రధాన కాలువల ద్వారా ఈ చెరువులోకి నీరు చేరుతుంది. చెరువు పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు కూడా చేశారు. ఎంజీ రోడ్డుకు నడక దూరంలోనే ఈ చెరువు ఉంటుంది.

 

 

ఉద్యానవనాల నగరంగా నేడు బెంగుళూరు వెలసిల్లుతుందంటే ఆనాటి కెంపెగౌడ ఆలోచన దూరదృష్టి లక్ష్య శుద్ధి మనం ఇప్పటికే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక నగర నిర్మాత గానే కాకుండా వచ్చే తరాల కోసం తాగు నీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించిన మహానుభావుడిగా కెంపేగౌడ ప్రసిద్ధి చెందారు. అందుకే ఇన్నాళ్ళకి కెంపెగౌడ ప్రధాన విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం ముందు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించడం మనందరికీ గర్వకారణం. వీటి వెనక రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నా వక్తలిగ కులం వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలు కూడా కెంపేగౌడ విగ్రహావిష్కరణ స్వాగతిస్తున్నాయి. అలాగే భారత మాజీ ప్రధాని దేవేగౌడ ఇటీవల దేశ పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్ లో కూడా కెంపే గౌడ విగ్రహాన్ని పెట్టాల్సిందిగా ప్రధానమంత్రి కి ఒక లేఖ రాశారు. ఏదేమైనా గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు దర్శనం చేయాలంటే ఇలాంటి మహానుభావులను మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

 

-బండారు రామ్మోహనరావు. (బెంగళూరు)98660 74027.

 

Tags:”Veeragallu” of yesteryear is today’s Bangalore–Bandaru Rammohana Rao.

Post Midle

Leave A Reply

Your email address will not be published.