Natyam ad

భారతీయ సంస్కృతిలో మహిళకు పూజనీయ స్థానం : మాతా రమ్యానంద భారతి స్వామిని

– మహతిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

– డా. కె.రాజేశ్వరిమూర్తికి శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని అవార్డు

– ముగ్గురికి పద్మావతి అవార్డులు ప్రదానం

 

Post Midle

తిరుపతి ముచ్చట్లు:

భారతీయ సంస్కృతిలో మహిళకు పూజనీయ స్థానం ఉందని, ఇక్కడ అణువణువునా స్త్రీ తత్వం ఇమిడి ఉందని రాయలచెరువులోని శ్రీ శక్తి పీఠం పీఠాధీశ్వరి  మాతా రమ్యానంద భారతి స్వామిని తెలియజేశారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బుధవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి విచ్చేసిన
మాతా రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేస్తూ మహిళకు దక్కుతున్న ప్రాధాన్యత దృష్ట్యా భారతదేశంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని అన్నారు. మహిళామూర్తి అయినశ్రీ వకుళామాతకు ఇచ్చిన మాట కోసం శ్రీవారు కలియుగంలో అవతరించి భక్తులను రక్షిస్తున్నారని చెప్పారు. మహిళకు విద్య, వాక్ శక్తి, ఆరోగ్యం, ఆత్మబలం, పరాక్రమం లక్షణాలు ఉండాలని వేదాల ద్వారా తెలుస్తోందన్నారు. మానవశక్తికి దైవశక్తి తోడైతే అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట పాటు ధ్యానం లేదా జపం చేయాలని చెప్పారు. తద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా తయారవుతారని తెలియజేశారు.

 

 

జేఈవో   సదా భార్గవి మాట్లాడుతూ, మహిళలకు లభిస్తున్న ప్రాధాన్యంతోనే భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోందన్నారు. మహిళాశక్తిని జాగృతం చేయడానికే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారని చెప్పారు.
స్త్రీ చైతన్య స్వరూపమని, మహిళ ద్వారా కుటుంబం, తద్వారా సమాజం చైతన్యవంతం అవుతాయన్నారు. టీటీడీ లో 1542 మంది మహిళా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని, వీరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఇటీవల మూడు రోజులపాటు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు.
మహిళకు అవమానం జరిగితే యుద్ధం ప్రారంభమవుతుందని గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను అందరికీ వినిపించారు.

 

 

జేఈవో  వీరబ్రహ్మం స్వాగతోపన్యాసం చేస్తూ, భగవంతుడు సృష్టిలో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించారన్నారు . సృష్టికి మూలం మహిళ అని అన్నారు. మనకు కావాల్సిన జ్ఞానాన్ని సరస్వతి, సంపదను లక్ష్మీదేవి, శక్తిని దుర్గాదేవి ఇస్తారని తెలియజేశారు. టీటీడీ లో మహిళా ఉద్యోగులు చక్కగా పనిచేస్తూ సంస్థను ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మొదటిసారి మహిళా ఉద్యోగులు రక్తదానం చేశారని, ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఆరోగ్యంపైన జాగ్రత్త వహించాలని కోరారు. జీవిత పరమార్ధాన్ని తెలుసుకుని చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా సంతోషంగా, సంతృప్తిగా, శాంతంగా జీవితాన్ని సాగించాలని సూచించారు.

 

 

టీటీడీ చైర్మన్   వైవి.సుబ్బారెడ్డి సతీమణి   స్వర్ణలత మాట్లాడుతూ, వేదవతి, వకుళమాత , లక్ష్మీదేవి ఈ ముగ్గురు మహిళామూర్తులకు ఇచ్చిన మాట కోసం శ్రీ వేంకటేశ్వర స్వామివారు శేషాచలంపైన అవతరించారని చెప్పారు. ఏ యుగంలో అయినా సనాతన ధర్మం మహిళకు పెద్ద వేసిందని చెప్పారు. పిల్లల పెంపకంలో మహిళలు జాగ్రత్త వహిస్తే సమాజంలో అత్యాచారాలు జరగవన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన రేణిగుంట ఎలక్ట్రానిక్ మానుఫాక్చర్ క్లస్టర్ సిఈవో   గౌతమి, సిఐడి మహిళా ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ   సరిత, జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని , పారిశ్రామికవేత్త  రత్నారెడ్డి, ప్రకృతి వ్యవసాయ రైతు   ఓబులమ్మ,   పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా.ప్రేమావతి ప్రసంగించారు.

ఆకట్టుకున్న జ్యోతినివ్వాలి

మహిళ గొప్పదనం, ఇంట్లో ఆడపిల్లల అవసరాన్ని గురించి టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తల్లిదండ్రులు రచించిన గీతాన్ని వినిపిస్తూ మహిళా ఉద్యోగులందరూ దీపాలతో ప్రదర్శించిన దీప నివాళి ఎంతగానో ఆకట్టుకుంది.

డా.కె.రాజేశ్వరిమూర్తికి  పద్మావతి విద్యాప్రకాశిని అవార్డు

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నడుం బిగించడంతోపాటు ఎంతోమంది విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజేశ్వరి మూర్తికి శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని అవార్డును టీటీడీ ప్రదానం చేసింది. డా.కె.రాజేశ్వరి మూర్తి తరఫున డా.ప్రేమావతి ఈ అవార్డును అందుకున్నారు.

పద్మావతి అవార్డులు

టీటీడీ లోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి స్టాఫ్ నర్స్   హేమసుధ,
ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకురాలు  వెంకటరమణమ్మ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. ఉమారాణి ఉన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం

టీటీడీలో మెరుగ్గా విధులు నిర్వహించి విశ్రాంత జీవితం గడుపుతున్న నలుగురు ఉద్యోగులను ఈ సందర్భంగా సన్మానించారు. వీరిలో డాక్టర్ ఝాన్సీ, ఫార్మసిస్ట్ శ్రీమతి సత్యవతి, అధ్యాపకురాలు    సుశీల, ఏఈఓ  హంసవేణి ఉన్నారు.మహిళా దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన మహిళా ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందజేశారు. వీరిలో  ఉషశ్రీ,  వాణి,   జమున,  లావణ్య,    రూప తదితరులు ఉన్నారు.అనంతరం స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షి ధ్యానం విశిష్టతను తెలియజేసి మహిళా ఉద్యోగులతో ధ్యానం చేయించారు.

 

 

ఎస్వీ సంగీతం నృత్య కళాశాల విద్యార్థులు పలు గీతాలకు చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగుల ఆదివో అల్లదివో… నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి మేలుకొలుపు సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణ తులాభారం పౌరాణిక నాటకాన్ని మహిళా ఉద్యోగులు చక్కగా ప్రదర్శించారు.అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. టీటీడీ ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో  స్నేహలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Tags:Venerable position of woman in Indian culture : Mata Ramyananda Bharati Swamini

Post Midle