మరోసారి నామినేషన్ వేసిన వేణుమాధవ్

Date:19/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
రాజకీయాలకు, వెండితెరకు విడదీయలేని సంబంధం ఉంది. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్రవేశారు. అందుకే, ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు తమ ప్రచారంలో సినీ గ్లామర్‌‌తో నింపి, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఇదే సమయంలో కొందరు నేరుగా పోటీకి ఆసక్తి చూపుతారు. తాజాగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కోదాడ నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబరు 16న కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేయగా, సరైన పత్రాలు లేకపోవడంతో దానిని అధికారులు తిరస్కరించారు. దీంతో సోమవారం మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతు దారులతో వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను ఆయన సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్‌ తెలిపారు. గురువారం వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. సరైన వివరాలు లేవని, నామినేషన్ చెల్లదని తెలిపారు. దీంతో నిరాశ చెందిన వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని శని లేదా ఆదివారాల్లో నామినేషన్‌ దాఖలు చేస్తానని తెలిపారు. తన స్వస్థలం కావడంతో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వివరించారు. ప్రజాసేవ చేసేందుకు ఇది తగిన సమయమని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ రెండు రోజులు వీలు కుదరకపోవడంతో సోమవారం కోదాడకు వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Tags:Venu Madhav was nominated once again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *