మీ సేవా కేంద్రాల్లో నిలువు దోపిడి

నల్గొండ ముచ్చట్లు:

వృద్ధులు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఆసరా అర్జీ దారుల సర్వీస్ చార్జీలు తానే భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదిలాఉండగా, మీ సేవ కేంద్రాల్లో మాత్రం నిలువు దోపిడీ కొనసాగుతూనే ఉంది. సర్వీస్ చార్జీలు మిగిలితే అర్జీ దారులకు ఎంతో కొంత ఆసరా అవుతుందని సర్కారు భావిస్తే, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఆ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. ఆసరా ఫించన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వృద్ధులు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని ఆసరా చేసుకొని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అక్రమ చార్జీల వసూళ్లకు తెగబడుతున్నారు. అమాయక పండుటాకుల వద్ద అందినకాడికి దోచేస్తున్నారు. కాటికి కాళ్లు చాచిన వయసులో ప్రభుత్వం ఇచ్చే ఫించన్ ఆసరాగా ఉంటుందన్న ఆశతో వృద్ధులు మీ సేవ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. అర్జీలతో వస్తున్న ముసలివాళ్లను మీ సేవల నిర్వాహకులు బాజాప్తాగా దోచుకుంటున్నారు. ఆసరా పింఛన్ పొందాలనుకునే వారు 57 ఏళ్ల వయసు ఉంటే సరిపోతుందని ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

 

 

ఈ మేరకు జీవోను విడుదల చేసింది. అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ విధానంలో అర్జీలు నమోదు చేయాలని సూచించింది.ఆసరా అర్జీదారులకు మీ సేవ కేంద్రాల్లో ఉచిత సేవలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉచిత సేవలకు గాను ప్రభుత్వమే చార్జీలు చెల్లిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయమై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నెల 14వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు మాత్రం ఆర్మూర్ నియోజకవర్గంలోని కొన్ని మీ సేవ కేంద్రాల్లో బుట్ట దాఖలవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో అక్రమ చార్జీల తతంగం యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. ఆసరా అర్జీదారుల తరఫున సర్వీస్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయం తెలిసి మీ సేవ సెంటర్ల వారు దరఖాస్తుదారుల వద్ద బలవంతంగా చార్జీలు చేస్తున్నారు.

 

 

 

ఇటు పండుటాకుల డబ్బులకు కక్కుర్తి పడుతూ అటు సర్కారు ఇచ్చే చార్జీలను పొందేందుకు అక్రమానికి తెర తీశారు. అర్జీదారుల వద్ద డబ్బులేమీ తీసుకోలేదన్నట్లు వారికిచ్చే రిసిప్టులపై సర్వీస్ చార్జీ కాలమ్‌లో జీరో అని ప్రింట్ చేస్తున్నారు. ఇటు ముసలివాళ్ల దగ్గర చార్జీలు వసూలు చేస్తూనే అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ రెండు చేతులా సంపాదించే పనిలో మీ సేవల నిర్వాహకులు బిజీగా ఉన్నారు.మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని మీ సేవ కేంద్రాలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వస్తున్న దరఖాస్తుదారుల పట్ల చార్జీల విషయమై కఠినంగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మీ సేవ వాళ్లు చార్జీలేమీ తీసుకోరని మావూళ్లో అన్నారని అర్జీదారులు చెప్పినా వినిపించుకోకుండా మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ముక్కు పిండీ వసూలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మీ సేవ కేంద్రాలన్నీ ప్రస్తుతం ఆసరా పింఛన్ అర్జీదారులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కోలా రూ.50 నుంచి రూ.100 అక్రమ చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మాక్లూర్ మండల కార్యాలయాల సముదాయానికి కూత వేటు దూరంలో మాదాపూర్ పరిధిలోని మీ సేవ కేంద్రంలో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. మాక్లూర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లోనూ ఇదే తంతు కొనసాగుతుండటం గమనార్హం.

 

Tags: Vertical exploitation in your service centers

Leave A Reply

Your email address will not be published.