పల్లె ప్రగతి నిధులు గోల్ మాల్

కరీంనగర్ ముచ్చట్లు

మునిసిపాలిటీలో నిధులు గతి తప్పుతున్నాయా..? పట్టణ ప్రగతి, హరితహారం కోసం మంజూరైన డబ్బు ఖర్చు చేయడంలో గోల్ మాల్ జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు స్థానిక కౌన్సిలర్లు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన ఆ ప్రాంతంలోనే అక్రమాలకు తెరలేపారన్న విషయమే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపాలిటీలో రూ. 40 లక్షల మేర స్కారం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కౌన్సిలర్లు కూడా ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. హరిత హారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిర్లు డిమాండ్ చేస్తున్నారు.
పట్టణ ప్రగతిలో డీజిల్ ఖర్చులు రూ. 5,00,000, డ్రైవర్ల జీతాలు రూ. 2,80,000 వెచ్చించినట్టుగా చూపించిన లెక్కలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలపై చర్చించేందుకు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా 2020- 21లో నెలకు రూ. 44 లక్షల చొప్పున ఏడాదికి గాను రూ. ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు, 2021 -22లో రూ. రెండు కోట్ల 88లక్షలు, 2022 -23లో రూ. కోటి 92 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. రూ. 83 లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. ఈ నెల19న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించారు. మున్సిపల్ లో రూ. 40 లక్షల కుంభకోణం జరిగిందని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.రూ. ఎనభై మూడు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ఎండకు ఎండుతూ వానకు నానుతుండగా, ఖాళీ మద్యం సీసాలను రేకుల షెడ్డులో స్టోర్ చేస్తున్నారు. కానీ స్వీపింగ్ మిషన్ ను మాత్రం ఆరు బయటే పార్క్ చేరడం విమర్శలకు దారి తీస్తోంది.

Tags: Village Development Funds Gol Mall

Leave A Reply

Your email address will not be published.