అక్కరకు రాని విలేజ్ మాల్స్

ఒంగోలు ముచ్చట్లు :

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 6,500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వీటిని నిర్వహించే డీలర్లకు నెలకు రూ.10–15 వేల ఆదాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.మాల్‌ ఏర్పాటు వ్యయం, సరుకుల అమ్మకాల్లో ఇచ్చే కమీషనుపై చెప్పిన మాటలకు ఆచరణకు పొంతన లేకపోవడంతో నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామంటూ, డీలర్లు సణుగుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా 2017 డిసెంబరులో ఆరంభించినపుడు 2 నెలలపాటు డీలరుకు నూనెలపై 3.4 శాతం, ఇతర సరుకులపై 8 శాతం కమీషను ఇచ్చారు. ఇదేదో బాగుందనుకుంటూ రాష్ట్రమంతా డీలర్లు ముందుకొచ్చారు. మార్చి నుంచి ప్రారంభించిన విలేజ్‌మాల్స్‌కు పప్పులు, నూనెలపై ప్యాకెట్ల లెక్కన కిలోకు రూపాయి, ఇతర సరుకులపై 3.5 నుంచి 4 శాతం కమీషనునే ఇస్తున్నారు. డీలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 50 శాతం మార్జిను తగ్గించేశారు. దీనితో నెలలో రూ.2 లక్షల విలువైన సరుకులు అమ్మితే రూ.8 వేలు వస్తే, అన్‌లోడింగ్‌ చార్జీలు, అదనపు అద్దె, కరెంటు బిల్లు, సహాయకుడి వేతనం, పేపర్‌ రోల్స్‌ ఖర్చులు లెక్కించుకుంటే మిగిలేదేమీ ఉండడం లేదని డీలర్ల ఆవేద. మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చనేలేదు. నిజానికి 2017 డిసెంబరులో ఆరంభించిన ఈ పథకంలో ఇప్పటికి కేవలం 100 మాల్స్‌ మాత్రమే నడుస్తున్నాయి.

 

 

 

మాల్‌లో అన్ని రకాల సరుకులను బయట మార్కెట్‌ కన్నా 5–10 శాతం తక్కువ ధరలతో విక్రయించేలా చూస్తామని చెప్పిన దానికి భిన్నంగా, నూనెలు మినహా నిత్యావసరాలు దాదాపుగా బయట మార్కెట్‌కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారుల ఆదరణ కోల్పోతున్నాయి. కందిపప్పు కిలో బయ ట మార్కెట్లో రూ.63కు విక్రయిస్తుంటే విలేజ్‌ మాల్స్‌లో రూ.69కు అమ్ముతున్నారు. ఈ లెక్కన అర కిలో ప్యాకెట్‌ను రూ.37కు ఇస్తున్నారు. అంటే రెండుసార్లుగా రెండు అరకిలోల కందిపప్పును కొనుగోలు చేసే పేద వినియోగదారుడు రూ.74 చెల్లించాల్సి వస్తోంది. సబ్బులు, రవ్వలు మినహా ఇతర సరకుల ధరలు మార్కెట్‌కు మించి రూ.5–12 శాతం హెచ్చుగా ఉంటున్నాయి.  రేషను దుకాణాన్ని చంద్రన్న విలేజ్‌మాల్‌గా తీర్చిదిద్దడానికయే వ్యయంలో 25 శాతం డీలరు, 25 శాతం ప్రభుత్వం, మిగిలిన 50 శాతం రిలయన్స్‌ ఫ్యూచర్‌  కంపెనీ భరిస్తుందని చెప్పారు. డీలరు వాటాను ముద్ర రుణంగా ఇప్పిస్తామని నమ్మబలికారు. తర్వాత తన వాటా లేకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీంతో 50 శాతం ఖర్చును డీలర్లే భరించాల్సివచ్చింది. తీరా ఇప్పుడు చంద్రన్న బోర్డు, ర్యాక్‌లు మాత్రమే రిలయన్స్‌ సప్లయి చేస్తుందని, మిగిలిన ఖర్చంతా డీలరే భరించాలనీ, కావాలంటే ఆ మొత్తాన్ని రిలయన్స్‌ సంస్థ 8 శాతం వడ్డీకి సమకూరుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుపై డీలర్లకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Village Malls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *