ఇంకా ముంపులోనే గ్రామాలు

రాజమండ్రి ముచ్చట్లు:


గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టినా ఇంకా ముంపులోనే పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు, లంకలు ఉన్నాయి. కాఫర్‌ డ్యాము వల్ల వరద వెంటనే తగ్గుముఖం పట్టడం లేదని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు 50.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. అక్కడి నుంచి దిగువకు 13.36 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం అప్పర్‌ స్పిల్‌ వే వద్ద 33.99 మీటర్లు, దిగువ స్పిల్‌ వే వద్ద 25.53 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు 11.79 లక్షల క్యూసెక్కుల నీటిని 15 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.

 

 

 

ధవళేశ్వరంలోని సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద 14.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 14.65 లక్షల క్యూసెక్కుల జలాలను 175 గేట్ల ద్వారా బ్యారేజీ నుంచి సుముద్రంలోకి విడుదల చేస్తున్నారు రెండ్రోజులతో పోల్చి చూస్తే భద్రాచలంలో 2.50 అడుగులకుపైగా, ధవళేశ్వరం వద్ద 0.5 అడుగుల నీటిమట్టం తగ్గింది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద చోట్లా రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలోని రోడ్‌ కం రైలు వంతెన వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. భద్రాచలంలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే మళ్లీ గోదావరి పెరిగే అవకాశం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలో గోదావరికి వరద రెండుసార్లు రావడంతో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలోని అంతర్వేది వరకూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.వరదలతో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని విలీన మండలాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. కాఫర్‌ డ్యాము వల్ల ఈ గ్రామాల్లో వరద తగ్గడం లేదు. గోదావరి, శబరి వరద ప్రారంభమై ఐదు రోజులు కావొస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన చింతూరు,

 

 

 

విఆర్‌.పురం, ఎటపాక, కూనవరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపులో ఉన్న తమ ఇళ్లు ఈసారి కచ్చితంగా పడిపోతాయని, ఇప్పటికే గోడలు నిమ్ము చేరి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపర్‌ డ్యామ్‌ వల్ల ఎక్కువ రోజులు వరద వేధిస్తోందని, గతంలో ఇన్ని రోజులు వరద నీరు ఉండేది కాదని తెలిపారు. దీనికి ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. కొయ్యూరు, కల్లేరు, చుట్టూరు, నర్సింగపేట. ముకునూరు, ఎ.జి.కోడేరు, మల్లెతోట, వేగితోట, బండారి గూడెం, చెడుమూరు సహా వంద గ్రామాలు నేటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారి ఇంకా వరద ముంపులోనే ఉండటంతో వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఈసారి వరద పోటుతో వందల ఎకరాల్లో జామాయిల్‌ తోటలు, వరి నాట్లు నీట మునిగాయని చింతూరు వాసులు తెలిపారు. పశువులకు మేత లేక గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ఎండిన డొక్కలతో ఉన్నట్టు చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు కానరావడం లేదని, వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతోందని, చీకటిపడితే దోమలతో సావాసం చేయాల్సి వస్తోందని తెలిపారు. శబరి నదికి భారీగా వరద నీరు చేరడం,

 

 

 

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్‌ డ్యామ్‌ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలోని రహదారులపైకి చేరిన వరద ఏ మాత్రమూ తగ్గడం లేదు. వింజరం-చీరవల్లి వద్ద ప్రధాన రహదారిని వరద ముంచెత్తడంతో ఎగువన ఉన్న 20 గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వచ్చే అవకాశం లేకుండాపోయింది. వేలేరుపాడు మండలంలో ఏడు గ్రామాల్లోని రహదారులు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.కృష్ణా నదికి వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి 4.09 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 3.77 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ప్రకాశం బ్యారేజీకి 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 3.53 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన పలు గ్రామాల్లోని లంకల్లోకి వరద నీరు కొనసాగుతోంది. వరద ఉధృతి కొంతతగ్గినా, ఇప్పటికీ వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

 

 

 

ఈ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.30 అడుగులకు చేరింది. ఈ జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 211.4759 టిఎంసిలుగా నమోదైందివశిష్ట గోదావరి పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంకలను ముంచెత్తుతోంది. ఆచంట మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయోధ్యలంక, పుచ్చల్లంక, భీమలాపురం శివారు కాపులపాలెంలో లోతట్టు ప్రాంతాలతోపాటు ఆవాసాలనూ వరద నీరు చుట్టుముట్టింది. భీమలాపురం శివారు కాపులపాలెంలో దిగువన ఉన్న కాజ్‌ వే పైనుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో దాదాపు వంద కుటుంబాలు వరద బారిన పడ్డాయి. కొబ్బరి తోటల్లో భారీగా వరద నీరు చేరింది. పలు ఇళ్లు చుట్టూ నీరు చేరడంతో డాబాలపై ఇంటి సామగ్రిని చేర్చుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, బాడవ, యలమంచిలిలంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో, ఆయా గ్రామాల ప్రజలు ప్రధానంగా తాగునీటికి అల్లాడుతున్నారు. ధవళేశ్వరం వద్ద ఉధృతి కొనసాగడంతో కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఎనిమిది, తూర్పుగోదావరి జిల్లాలో మూడు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ధవళేశ్వరం వద్ద ఉధృతి కొనసాగుతుండడంతో కోనసీమ జిల్లాలోని లంకలపై వరద ప్రభావం కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

Tags: Villages are still under water

Leave A Reply

Your email address will not be published.