విశాఖ టూ విజయనగరం భూములకు రెక్కలు

Date:15/02/2020

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన ఏమో గాని విజయనగరం జిల్లాలో మాత్రం భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక్కడ భూములు కొనే పరిస్థిితి లేదు. ఇప్పటికే వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్న వారి సంఖ్య రాజధాని ప్రకటనతో మరింత పెరిగిపోయింది. ప్రధానంగా విశాఖ పట్నం – విజయనగరం ప్రాంతాల మధ్య రియల్ వ్యాపారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం రాజధాని ప్రకటనే.భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన నాటి నుంచే ఇక్కడ భూముల ధరలు చుక్కలనంటాయి. ఎయిర్ పోర్టు వస్తుండటంతో చుట్టుపక్కల భూములన్నీ రియల్ వెంచర్లతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన రావడంతో ఇది మరింతగా పెరిగింది.

 

 

 

పేరున్న రియల్ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఎకరాలకు ఎకరాలు భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నాయి. రాజధాని ఇక్కడే నంటూ ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి.రాజధాని ప్రకటనతో ముఖ్యంగా భీమిలి, పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో భూములు కొందామన్నా దొరికే పరిస్థితి లేదు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన అంతా రియల్ వెంచర్లే కనపడుతున్నాయి. తగరపు వలస, ఆనందపురం మండలాల్లో కూడా రియల్ వ్యాపారం ఊపందుకుంది. దీనికి ప్రధాన కారణం జీఎన్ రావు కమిటీ నివేదిక అని చెబుతున్నారు.

 

 

 

 

విశాఖకు ఉత్తరం వైపున నలభై కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మాణం జరగాలన్న కమిటీ నివేదిక ప్రకారం ఇక్కడే వస్తుందని రియల్టర్లు కొనుగోలుదారులను నమ్మ బలుకుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం మధ్యలో భూములు ధరలు నింగినంటాయి. ఇక్కడ వెంచర్లు అధికంగా వేయడంతో గతంలో కన్నా ప్లాట్ల ధరలను రియల్టర్లు పెంచేశారు. మూడు రెట్లకు భూములు ధరలు పెరిగాయి. దీంతో రియల్ వ్యాపారం రాజధాని ప్రకటనతో ఊపందుకుంది. అయితే సామాన్యులకు మాత్రం ధరలు అందుబాటులో లేవు. మొత్తం మీద రాజధాని ప్రకటనతో విజయనగరం,విశాఖ మధ్యలో ప్రాంతానికి మహర్దశ పట్టిందనే చెప్పాలి.

 

 

పద్మనాభంలో ఆఫీసులుప్రస్తుతానికి రుషికొండలోని ఐటీ టవర్లలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన మొదలుపెట్టినా సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయి భవనాలు నిర్మించడానికి అనువుగా పద్మనాభాన్ని గుర్తించారని అంటున్నారు. దీనికి జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ కూడా ఇపుడు అంతా ప్రస్తావిస్తున్నారు. రాజధాని విశాఖ రాబోతోంది. అందువల్ల భూములు ఎవరూ అమ్ముకోకండి, మీకు మంచి రోజులు వస్తాయని పద్మనాభం రైతులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన హితబోధ కూడా చర్చకు వస్తోంది.

 

 

 

 

 

అంటే భవిష్యత్తుల్లో ఇక్కడ ఉన్న విలువైన ప్రభుత్వ భూముల్లో రాజధాని ఏర్పాటు అయితే సమీపంలో ఉన్న రైతుల భూములు కూడా బంగారం అవుతాయని అంటున్నారు.ఇక జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తీసుకున్నా కూడా సముద్రానికి దూరంగా సచివాలయం నిర్మించుకోమని సూచించింది. ఆ విధంగా ఆలోచించుకుంటే పద్మనాభం బెస్ట్ ప్లేస్ గా కూడా చెబుతున్నారు. ఆ విధంగా అటు విశాఖ, ఇటు విజయనగరానికి, శ్రీకాకుళానికి దగ్గరగా కూడా పద్మనాభంలో రాజధాని ఉంటుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పద్మనాభం రాజధాని ప్రాంతం అయితే మళ్ళీ గత శతాబ్దాల నాటి కాంతులు సంతరించుకోవడం ఖాయమని అంతా అంటున్నారు. చూడాలి మరి ఈ విశిష్ట ప్రదేశం మరెంతగా ప్రకాశిస్తుందో.

రెండు పార్టీల మధ్య సెలక్షన్ కమిటీ రచ్చ

Tags: Visakha Too Wings Of Vijayanagaram Lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *