విశాఖలో కడప కల్చర్

Date;28/02/2020

విశాఖలో కడప కల్చర్

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్త్రి. అటువంటి అయ్యన్నపాత్రుడు మాట్లాడితే చాలు వివాదమే. ఆయన నోటి వెంట పరుష పదజాలమే అలా వచ్చేస్తుంది. మరి టీడీపీకి అలాంటి ఫైర్ బ్రాండ్ అవసరమని చంద్రబాబు కూడా ఆయన్ని హైలెట్ చేస్తున్నారనుకోవాలి. ఆయన మళ్ళీ కడప కల్చర్ మీద నోరు చేసుకున్నారు. కడప కల్చర్ ని విశాఖలో దిగుమతి చేస్తున్నారుట. స్మార్ట్ సిటీ జనం వణికిపోతున్నారుట.నిజానికి అయ్యన్నపాత్రుడు ఉమ్మడి ఏపీకి మంత్రిగా చాలా కాలం పనిచేసిన నాయకుడు. ఆయనకు ఒక ప్రాంతం, ఒక వర్గంతో వివక్ష అన్నదే ఉండకూడదు. పైగా మంత్రి హోదాలో ఆయన ఎన్నో సార్లు కడప వెళ్ళారు కూడా. అటువంటిది కడప ఎక్కడో పరాయి దేశంగా, పాకిస్థాన్ అవతల ఉన్నట్లుగా తరచూ మాట్లాడుతూ భయపెట్టడమేంటని వైసీపీ నేతలు అంటున్నారు. లుంగీ బ్యాచులట. కడప కల్చరట. పులివెందుల ఫ్రాక్షనట. ఏంటో ఈ భాష. అన్న వాళ్ళూ చిల్లర నాయకులు కాదు, చిన్నా చితకా పదవులు చేసిన వారు అంతకంటే కాదు, ఉమ్మడి ఏపీ నుంచి మంత్రులుగా ఉన్న వారు. అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకుంటామని ప్రమాణం చేసి ఏలిన దొరలు. మరి అటువంటి వారి నోటి వెంట ఒక ప్రాంతాన్ని కించపరచే కామెంట్స్ రావడం దారుణమే.విశాఖలో లుంగీ బ్యాచులు దిగిపోయాయట. ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారట. ఇదీ ఘనత వహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్. విశాఖను లుంగీ బ్యాచులు పాడుచేస్తున్నాయట. జనమంతా వణికిపోతున్నారుట. అంతేనా కడప కల్చర్ స్మార్ట్ సిటీలోకి ఎంటరైందట. అభివృద్ధి అన్నది ఎక్కడా లేకుండా సర్వనాశనం చేస్తున్నారుట. మొత్తానికి అయ్యన్నపాత్రుడు లాంటి పెద్దలు ఇలా మాట్లాడడమే దారుణమని కామెంట్స్ వస్తున్నాయి. మంత్రిగా పనిచేసిన అయ్యన్నకు కడప అంటే పరాయి దేశంగా కనిపిస్తోందా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఇక లుంగీ బ్యాచులంటూ మరో గడ్డ కల్చర్ ని కించపరచే హక్కు ఎవరు ఇచ్చారని గద్దిస్తున్నారు. మొత్తానికి ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న తరహాలో అయ్యన్నపాత్రుడు సహా తమ్ముళ్ళు ఆరేళ్ళుగా విశాఖలో కడప కల్చర్ అంటూ రెచ్చగొడుతూనే ఉన్నారు. విశాఖ కడపల మధ్య గొడవలు పెడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకులుగా విమర్శలు చేసుకోవచ్చు కానీ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే రేపటి రోజున దాన్ని ఆపడం కష్టమన్న సంగతి సీనియర్ నేతకు తెలియదా అంటున్నారు.

Tags;Visakhapatnam-Kadapa-Culture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *