విశాఖకు మెట్రో కలేనా…

Date:10/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృధ్ధి చెందుతున్న సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి రాజధాని హైదరాబాద్ కు తొలి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని మంజూరు చేశారు. ఆ తరువాత విడతలో ఏపీలో విశాఖ సిటీని ఎంపిక చేసి మెట్రో రైల్ కూత పెట్టించారు. ఇదంతా కేంద్రంలో యూపీయే సర్కార్ అధికారంలో ఉన్నపుడు జరిగిన వ్యవహారం. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్డంగా రెండు ముక్కలు కావడంతో మెట్రో ప్రాజెక్ట్ కూడా మూలన చేరిపోయింది.
విశాఖకు మెట్రో రైల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విభజన హామీల్లో కూడా ఉంది. విశాఖకు ఎన్నిక ప్రచారానికి వచ్చిన మోడీ, చంద్రబాబు అన్నీ చేస్తామంటూ నమ్మబలికారు. ఆ తరువాత అనుకున్నట్లుగానే కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ళ పాటు ఇద్దరూ కలసి పాలన చేశారు.
ఆ టైంలో విశాఖ మెట్రో ఎక్కడా గుర్తుకు రాలేదు సరికదా బాబు సీఎం అయ్యాక విజయవాడకు మెట్రో రైల్ కావాలంటూ అప్పటి కేంద్ర పట్టణాభివ్రుధ్ధి మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా మంజూరు చేయించుకున్నారు. దాంతో విశాఖ మెట్రో పూర్తిగా వెనక్కుపోయింది.విశాఖ నవ్యాంధ్రాలో అతి పెద్ద నగరం. ఉత్తరాంధ్ర ప్రజనీకం మొత్తం ఉపాధికి ఆధారపడిన సిటీ. దాదాపుగా ముప్పయి లక్షల మంది జనాభాకు చేరువ అవుతున్న విశాఖ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలన్న ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి.
మెట్రో రైలు వస్తే శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లక్షలాది మందికి రవాణా సులువు అవుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన మెట్రో ప్రాజెక్ట్ విషయంలో ఫీజుబిలిటీ లేదని చెప్పి పాలకులు తప్పించుకున్నారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్ షిప్ గా ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని అనుకున్నా ప్రతిపాదనలు ఏవీ రాజకీయ కారణాల వల్లనే ముందుకు సాగలేదు. విశాఖ జనం కూడా మెట్రో రైల్ ఒక కల అని భావించి ఊరుకున్నారు.హఠాత్తుగా ఇపుడు చంద్రబాబు మంత్రివర్గం విశాఖలో మెట్రో రైల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
సాధ్యమైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించాలనుకుంటోందట. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం దాదాపుగా ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు. ఇపుడు కూదా పీపీపీ విధానంలోనే దీనిని చేపడతారని చెబుతున్నారు. మొత్తం 43 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ కూత వినిపించేలా రూపకల్పన చేశారు. అంతా బాగానే ఉంది కానీ సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి కూడా లేదు. మరో నలభై రోజుల్లో కొత్త ఏడాది వస్తోంది.
సంక్రాంతి పండుగ తరువాత ఎన్నికల కోలాహలం మొదలవుతుంది.మరి మెట్రో రైలు ప్రతిపాదన ఇపుడు ముందుకు తెస్తే ఎపుడు ప్రారంభిస్తారన్నది పాలకులే చెప్పాలంటున్నాయి విపక్షాలు. ఒప్పందాలు కుదుర్చుకుని పట్టలెక్కెటప్పటికే పుణ్య కాలం పూర్తి అవుతుందని కూడా అంటున్నారు. ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి ముందుకు తెచ్చిన ప్రాజెక్ట్ అని అంటున్నారు. నిజంగా టీడీపీకి చిత్త శుధ్ధి ఉంటే నాలుగేళ్ళ క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టి ఇప్పటికి ఓ దశకు తెచ్చేవారని కూడా దెప్పిపొడుస్తున్నారు. మరి ఈ హామీతో రేపటి ఎన్నికల్లో విశాఖ జనం ఓట్లు అడగాలని టీడీపీ పధకం వేస్తోంది. ప్రజలు నమ్ముతారా.
Tags: Visakhapatnam Metro Kalena …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *