55 కోట్లతో వైజాగ్ టెర్మినల్ విస్తరణ

Vizag terminal expansion with 55 crores

Vizag terminal expansion with 55 crores

Date:22/05/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌ విస్తరణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. రూ.55 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటికే వంద కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్‌ భవంతి, 10,030 అడుగుల పొడవున రన్‌వే అభివృద్ధి జరిగింది. మూడు ఏరో బ్రిడ్జిలు, పార్కింగ్‌ బేస్‌లు విస్తరించింది. ఆరు పార్కింగ్‌బేలు ఇప్పటికే ఉండగా, మరో ఆరు పార్కింగ్‌ బేలు విమానాలు నిలుపుదలకు ఇటీవల సిద్ధం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో టెర్మినల్‌ బిల్డింగ్‌ ఎటూ చాలడం లేదు. లోపల రద్దీ పెరిగిపోయి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటోంది. ఈ తరుణంలో ఇక్కడి టెర్మినల్‌ బిల్డింగ్‌ను రెండు వైపులా 75 స్క్వేర్‌ మీటర్ల చొప్పున తూర్పు, పశ్చిమ దిశల్లో పదివేల స్క్వేర్‌ మీటర్ల విస్తరణ చేపట్టాలని పౌరవిమానయానశాఖ నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌ అధికారులు ఇప్పటికే మార్కింగ్‌లు ఇచ్చేశారు. మరో పది రోజుల్లో పనులకు శ్రీకారం జరపాలని ఆశాఖ ఢిల్లీ నుంచి ఆదేశాలిచ్చింది.మరో పది రోజుల్లో పనుల శంకుస్థాపనకు శ్రీకారం జరపాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గోకే పరిమితం చేసి ప్రయాణాలన్నీ భోగాపురం వైపు సాగిస్తారన్న ప్రచారానికి తెరపడినట్లయింది. రన్‌వేను మరో 300 అడుగులు విస్తరించడంతో పాటు మరో మూడు లగేజ్‌ బెల్టులు, మరో మూడు ఏరో బ్రిడ్జిలు ఏర్పాటుకు కూడా ప్రణాళికలు చేసింది. ఇప్పటికే దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, పోర్టుబ్లెయిర్, కొలంబో నుంచి అంతర్జాతీయ విమానాలు ఇక్కడ వాలుతుండగా, ఇంకా ఇక్కడ బోయింగ్‌ 747, ఎయిర్‌బస్‌ 340, ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ వంటి విమానాలు ఇక్కడ దించడానికి ఆయా విమాన సంస్ధలు ఉవ్విళ్లూగుతుండడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి విమానాశ్రయాలను పౌరవిమానయానశాఖ బీ గ్రేడ్‌గా గుర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ప్రయాణికుల రద్దీ 15 లక్షలు దాటితే ఏ గ్రేడ్‌ విమానాశ్రయంగా గుర్తింపునిస్తుంది. దీని వల్ల విమానాశ్రయం అభివృద్ధి అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రపంచస్ధాయి అందాలు, సదుపాయాలూ చేకూరుతాయి. ఆ రకంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు తదితర విమానాశ్రయాలు గుర్తింపు పొందాయి. విశాఖ విమానాశ్రయంలో 2015–16లోనే 15లక్షలుదాటి ప్రయాణాలు సాగించిన తరుణంలో కేంద్రం ఆ స్థాయిని అప్పుడే ఇచ్చేసింది. గడచిన ఏడాదిలో 24,09,712 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఇక్కడి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడం విశేషం.
TAgs:Vizag terminal expansion with 55 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *