Date:26/09/2020
కర్నూలు ముచ్చట్లు:
మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్న వాలంటీర్ వ్యవహారం కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. తన వద్దకు వస్తే పింఛను ఇప్పిస్తానంటూ మహిళను వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సి.బెళగల్ మండలంలో జరిగింది. గ్రామానికి చెందిన వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలోని ఓ మహిళపై కన్నేశాడు. ఆరు నెలలుగా ఆమెకు ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు.ఎవరెవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావ్ కదా.. నాతో ఎందుకు మాట్లాడవంటూ వెకిలి చేష్టలు చేసేవాడు. తన వద్దకు వస్తే పింఛన్ ఇప్పిస్తానంటూ నీచంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా హెచ్చరించింది. ఆమెతో మాట్లాడిన ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజుల కిందటే ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.దీంతో ఆమె వాలంటీర్, మరో ఇద్దరిపై లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి రాజీ యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. వాలంటీర్ బంధువు ఒకరు అధికార పార్టీ నాయకుడు కావడంతో కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే బాధితురాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు సదరు కీచక వాలంటీర్‌పై కేసు నమోదైంది.
Tags:Voluntary rallies in Kurnool