ఓటు దారి చెప్పే వీవీప్యాట్

Date:22/09/2018
కామారెడ్డి ముచ్చట్లు:
ఎన్నికల్లో ఈవీఎం మెషీన్లకు బదులు బ్యాలెట్ విధానమే అమలు చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఈ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలే ఇందుకు కారణం. ఈ మెషీన్లను ట్యాంపరింగ్ చేయడం సులువని, అవకతవకలు జరిగే అవకాశం ఉందని పలు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అయితే ఇలాంటి భయాలేవీ అక్కర్లేదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంల పనితీరు భేషుగ్గా ఉందంటున్న సీఈసీ ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునే అవకాశం కల్పిస్తూ వీవీప్యాట్‌లను సిద్ధం చేసింది.
తాము వేసిన వారికే ఓటు పడిందా లేదా అని చెక్‌ చేసుకునేందుకు ఈ పరికరం ఉపయుక్తంగా ఉంటుందని అంటోంది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో వీవీప్యాట్‌లను పెద్దస్థాయిలో వినియోగించాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించనున్నారు అధికారులు. వాస్తవానికి వీవీప్యాట్ మెషీన్లను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో వినియోగించారు.
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లోనూ వీటిని వినియోగించారు. ఈ యంత్రాల ద్వారా ఓటర్లు తాము వేసిన ఓటు ఎవరికి పడిందనే విషయం గుర్తించగలరు. వీవీప్యాడ్‌లను ఈవీఎం యంత్రాలకు అనుసంధానించడం ద్వారా ఓటు ఎవరికి వెళ్లిందీ ఓటరుకు తెలిసిపోతుంది. ఈవీఎం యంత్రంపై ఓటరు తనకు నచ్చిన గుర్తు బటన్‌ని నొక్కిన వెంటనే.. ఓటరు నొక్కిన గుర్తు పకనున్న వీవీప్యాడ్‌లో కనిపిస్తుంది. ఏడు సెకండ్ల పాటు ఆ గుర్తు ఓటరుకు కనిపించి వీవీప్యాట్‌కి అమర్చిన డబ్బాలో రసీదు పడిపోతుంది. ఆ రసీదుపై ఓటరు సంఖ్యతో పాటు గుర్తు ఉంటుంది.
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో సమస్యలు వచ్చి మొరాయించినా.. లేక అనుమానాలు వచ్చినప్పుడు వీవీప్యాడ్‌ రసీదులను డబ్బా నుంచి బయటకు తీసి లెక్కిస్తారు. ఈ విధానం వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఈవీఎంల పనితీరుపై వస్తున్న విమర్శలు, ఆందోళనలు, నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తోంది.
ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా పక్కాగా పోలింగ్ నిర్వహించాలని చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీప్యాట్‌లను వినియోగిస్తోంది. పోలింగ్‌లో ఈవీఎంతో పాటు వీవీప్యాడ్‌ను పోలింగ్‌ బూత్‌లలో అందుబాటులో ఉంచుతారు.
దీంతో ఓటింగ్‌పై ఓటర్లు, ప్రజాప్రతినిధులు ఆందోళనలకు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. వీవీప్యాట్‌ల పనితీరు గురించి జిల్లాయంత్రాంగం విస్త్రృత ప్రచారానికి సిద్ధమవుతోంది. త్వరలో గ్రామగ్రామన వీవీప్యాడ్‌ యంత్రాలతో అధికారబృందం అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది.
Tags:Vote vote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *