వేతన వేదన!

Date:12/03/2018
నల్గొండ ముచ్చట్లు:
గ్రామాల్లో ఉపాధి వలసలను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకం నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇవ్వడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆర్ధిక సంవత్సరం ముగింపు దగ్గరపడినా లక్ష్యం మాత్రం చేరుకోలేదని అంటున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్లుగా పనులు కల్పించకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ఉపాధి హామీ చట్టం నిర్దేశించిన ప్రకారం కూలీలకు గరిష్ఠంగా రోజుకు రూ.197 చెల్లించాలి. జిల్లాలో ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు. చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా అది అమలు కావడం లేదు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో పంటల సాగు సమయంలో వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ.300 నుంచి రూ.400 గిట్టుబాటు అవుతోంది. కూలి ఎక్కువగా వస్తుండడంతో జాబ్‌కార్డు ఉన్న చాలామంది ఆ పనులకే వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు, పనిదినాలు పెంచారు. అయినా ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదు. లక్ష్యాలు అందుకోవడంలేదు. ఉపాధిహామీ క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలు విధించినా ఆశించిన ఫలితం దక్కడంలేదు. ఉపాధి పనులు ఆశించిన స్థాయిలో జరగక పోవడానికి అనేక కారణాలున్నాయి. పథకం అమలుపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపించడం ఒక కారణమైతే ఇతర పనులకు వెళ్తే ఎక్కువ కూలి వస్తుండడం మరో కారణం. ఇలాంటి కారణాల వల్ల ఈ పథకం కింద ఉపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉన్నతాధికారులు తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. మండలాల వారీగా పనుల తీరును పరిశీలించి కారణాలు తెలుసుకుని లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా ఉంది. వేతనాలు సకాలంలో అందకపోవడం కూడా కూలీలు ముందుకు రాకపోవడానికి మరో కారణం. నిబంధనల ప్రకారం పనిచేసిన 15 రోజులలోపు వేతనం కూలీల ఖాతాల్లో జమ కావాలి. అయితే వేతకాలు సకాలంలో అందక లబ్ధిదారులు నానాపాట్లు పడుతున్నారు. కొందరు కూలీలకు బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నారు. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో తగినంత నగదు అందుబాటులో లేక వారికి సకాలంలో వేతనం అందని పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారయంత్రాంగం స్పందించి ఉపాధి హామీ పథకానికి ఉన్న సమస్యలు తొలగించి లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags: Wage grief!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *