కొత్త కారు కోసం వెయిటింగ్
ముంబై ముచ్చట్లు:
ప్రస్తుతం కొత్త కారును సొంతం చేసుకోవాలంటే డబ్బులుంటే చాలదు. దానికి మించి ఓపిక కావాలి. క్యూలోని లక్షల మందిలో ఒకరిగా వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. కనీసం రెండు, మూడు నెలల నుంచి గరిష్టంగా ఐదారు నెలల దాక ఎదురుచూడక తప్పదు. కొత్త కార్ల కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రీ-బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో 10 లక్షలకు పైగా కొత్త కార్ల ఆర్డర్లు వివిధ కంపెనీల వద్ద ఉండటం విశేషం. కార్ల తయారీ వేగం పుంజుకున్నా సంతృప్తికర స్థాయిలో డెలివరీలు జరగట్లేదు.ఇటీవలి కాలంలో మార్కెట్లోకి విడుదలవుతున్న కొత్త మోడళ్లకు ప్రజల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో రోజురోజుకీ మరిన్ని ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. దీనికితోడు కొవిడ్ సమయంలో సప్లై చెయిన్‌లో తలెత్తిన ఆటంకాలు ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవటం వల్ల చిప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా ప్రధాన కార్ల తయారీ సంస్థల్లో ప్రి-బుకింగ్స్ కుప్పలు తెప్పలుగా మూలుగుతున్నాయి. అత్యధికంగా మహింద్రా కంపెనీలో లక్షన్నర ఆర్డర్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి.
ఈ సంస్థ రూపొందించే స్కార్పియో-ఎన్, స్కార్పియో మోడళ్ల కోసం కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహింద్రా తర్వాతి స్థానంలో కియా కంపెనీ ఉంది. ఈ సంస్థ తయారుచేసే కారెన్స్, సెల్టోస్, సోనెట్ మోడళ్ల కోసం ఏకంగా లక్షా పాతిక వేల మంది వెయిట్ చేస్తున్నారు. హుందాయ్ కంపెనీ మోడళ్లయిన వెన్యూ, క్రెటా, ఐ20, ఐ10ల కోసం కూడా ఇంతే సంఖ్యలో ఆశావహులు ఎదురుచూస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. మారుతీ సీఎన్జీ వేరియంట్ల కోసం లక్షా 30 వేల మంది, బ్రెజ్జా మరియు గ్రాండ్ విటారా కోసం మరో లక్షా 30 వేల మంది వెయిట్ చేస్తున్నారు. మహింద్రా ఉత్పత్తి చేసే మరో రెండు మోడళ్లు ఎక్స్‌యూవీ-700, థార్‌ల కోసం లక్షా 10 వేల మంది ముందే బుకింగ్ చేసుకొని కూర్చున్నారు.మారుతీవాళ్ల బాలెనో, స్విఫ్ట్, సెలెరియో, ఎర్టిగా మోడళ్లకు 75 వేలు, టయోటా హైరైడర్ కోసం 60 వేలు, టాటా నెక్సాన్, పంచ్, నెక్సాన్ ఈవీలు కావాలంటూ 50 వేలు, ఎంజీ కంపెనీ ఆస్టర్, హెక్టర్ మోడళ్లకు 45 వేల ఆర్డర్లు రావటం గమనార్హం. మహింద్రా అండ్ మహింద్రా సంస్థ ఆగస్టులో ఆవిష్కరించిన స్కార్పియో-ఎన్ మోడల్‌కి బుకింగ్ మొదలైన అర్ధ గంటలోనే లక్షకు పైగా ఆర్డర్లు రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాబట్టి మోడల్ విషయంలో రాజీ పడితే తప్ప ఇప్పుడు మన దేశంలో చేతిలో డబ్బున్నా కొత్త కారు చేతికొచ్చే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Tags: Waiting for a new car
