Natyam ad

బదిలీల కోసం ఎదురుచూపులు

గుంటూరు ముచ్చట్లు:

బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభించేలోపు పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. బడులు తెరిచి మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఇంకా తేల్చలేదు. ఇంకా రేపోమాపో.. అంటూ బదిలీలపై నాన్చుతూనే ఉంది. బదిలీల అంశం రేషనలైజేషన్‌తో ముడిపడి ఉంది. రేషనలైజేషన్‌కు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. దీనిని ఒక కొలిక్కి తీసుకొస్తామంటూ రోజురోజుకూ విద్యాశాఖ పొడిగించుకుంటూ పోతుంది. బదిలీల ఫైల్‌ మాత్రం విద్యాశాఖ మంత్రి నుంచి సిఎం వద్దకు వెళ్లి మూడు వారాలు గడుస్తోంది. ఇంతవరకు సిఎంఒ నుంచి ఈ ఫైల్‌కు క్లియరెన్స్‌ రాలేదు. సిఎం ఆమోదం తెలిపిన వెంటనే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ సిద్ధంగా ఉంది. సోమవారం పాఠశాల విద్యాశాఖపై జరిపిన సమీక్షలో బదిలీలపై స్పష్టత వస్తుందనే ఆశతో ఉపాధ్యాయులంతా ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయింది. అయితే గరిష్టకాల పరిమితి (లాంగ్‌స్టాండ్‌)పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిదేళ్లు ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు కచ్చితంగా బదిలీ కావాలనేది నిబంధన.

 

 

 

బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు అంశాల్లోనూ మార్పులు చేయాలనే భావనతో ఉంది. ఎనిమిదేళ్ల గరిష్టకాల పరిమితిని ఐదేళ్లకు కుదిస్తామని ప్రకటించింది. కనిష్ట కాలపరిమితిని సున్నా సర్వీసుగా మారుస్తామని ప్రకటించింది. గరిష్టకాలపరిమితి అంశాన్ని ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం కూడా తర్జనభర్జన పడుతోంది. దీంతో ఐదేళ్లు ఉంటుందా? ఎనిమిదేళ్లు ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. బదిలీల ఫైల్‌కు త్వరగా క్లియరెన్స్‌ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సిఎంఒను ఇప్పటికే పలుసార్లు కోరినట్లు సమాచారం. 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నారు. చివరిసారిగా 2020లో బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో 74 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. బదిలీలు జరిగితే పూర్తికావడానికి కనీసం నెల సమయం పడుతుంది. దసరా సెలవుల్లోపు బదిలీలు పూర్తయితేనే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో జరిగితే బోధన విషయంలో పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

Post Midle

Tags: Waiting for transfers

Post Midle

Leave A Reply

Your email address will not be published.