వాల్టా చట్టానికి తూట్లు

Date:12/01/2019
కర్నూలు ముచ్చట్లు:
తుంగభద్ర నదిలో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నదీగర్భం నుంచి ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం దాపురించింది. ఇప్పటికే ప్రమాద స్థాయికి భూగర్భజలాలు పడిపోయాయి. ఇసుక మాఫియా నిత్యం ఇసుకను తరలిస్తే నదీపరివాహకం పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికార, అనధికార రీచ్‌ల ద్వారా వేలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్‌ దాడుల్లో 25 ట్రాక్టర్లు సీజ్‌ చేయడమే ఇందుకు నిదర్శనం. అధికారికంగా ఉన్న పది రీచ్‌లలో 3.76 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నాయి. గత ఏడాది మార్చి నుంచి ఒక్క ప్రభుత్వ అభివృద్ధి పనులకే 2.36 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగిస్తున్నట్లు శాండ్‌ లెవల్‌ కమిటీ అధికారులు చెబుతున్నారు.
సాధారణ ప్రజలకు 50 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే వాగులు, వంకల ద్వారా అనధికారికంగా 5లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకు ఇసుక నిల్వలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. శాండ్‌ లెవల్‌ కమిటీ ప్రాంతాల దూరాన్ని, రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధర నిర్ణయించింది. కర్నూలు టౌన్‌ ట్రాక్టర్‌ ధర రూ.1,800 – రూ.2,250. బ్లాక్‌ ధర రూ.2,500. ఆత్మకూరు ధర రూ.2500, బ్లాక్‌లో రూ.3,000. ఆదోని ధర రూ.2,000, బ్లాక్‌లో రూ.2,500. డోన్‌లో ధర రూ.3,000, బ్లాక్‌లో రూ.3,500. నంద్యాల ధర రూ.4,500, బ్లాక్‌లో రూ.5,000. ఇలా ట్రిప్పు ట్రిప్పునకు రూ.500 నుంచి రూ.1,000వరకు అదనంగా లాభం వస్తుండటంతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 10 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. కర్నూలు మండలంలో పూడూరు, పడిదెంపాడు, సి.బెళగల్‌ మండలంలో ఈర్లదిన్నె, గుండ్రేవుల, గోనెగండ్ల మండలంలోని వేముగోడు, దేవనకొండ మండలంలోని లక్కందిన్నె, నందికొట్కూరు మండలంలోని శాతనకోట, బిజనవేముల, హొళగుంద మండలంలోని ముద్దటిమాగి రీచ్‌లు ఉండగా, అనధికారికంగా  హాలహర్వి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు, నందవరం, వెల్దుర్తి, కోడుమూరు, సి.బెళగళ్‌ తదితర  మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలను లక్ష్యంగా చేసుకొని తెలుగు తమ్ముళ్లు బరి తెగించిపోతున్నారు. నదీగర్భాలు, వంకల్లో లోతట్టు నేల కన్పించేలా మరీ ఇసుకను తవ్వి వంకలను మాయం చేస్తున్నారు. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె–నార్లాపురం గ్రామాల మధ్య వంకలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండటంతో ఈ ప్రాంతంపై కన్నెసిన తెలుగు తమ్ముళ్లు వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
Tags:Waltz to the law

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *