గండాలు మోసుకొస్తున్న వానగాలి

Wandering the gangs

Wandering the gangs

Date:17/09/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
వానగాలి వీస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకూలుతున్నాయి. తీగలు తెగిపడుతున్నాయి. ఈదురుగాలి స్థాయిలో గాలి లేకున్నా.. వేగం కొంత అధికంగా ఉంటే చాలు సమస్యలు ఏర్పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జామాయిల్, సుబాబుల్ లాంటి చెట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని పలువురు అంటున్నారు.
ఏపుగా పెరిగిన చెట్లు గాలికి కూలడమో లేక.. వంగిపోవడమో జరుగుతున్నప్పుడు అవి విద్యుత్ స్తంభాలపై పడుతున్నాయని చెప్తున్నారు. ఇలాంటప్పడుతు స్తంభాలు నేలకూలుతున్నాయని విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయని చెప్తున్నారు. వాస్తవానికి మైదాన ప్రాంతంలో సమస్య తలెత్తితే గుర్తించి పరిష్కరించడం సులువే. కానీ పొలాలు, ముఖ్యంగా సుబాబుల్, జామాయిల్‌ సాగు ప్రాంతాల్లో సమస్య తలెత్తితే విద్యుత్తు సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు.
అర్థరాత్రైనా సమస్య తలెత్తిన ప్రాంతానికి పరుగులు తీయాల్సి వస్తోందని అంటున్నారు.   వ్యవసాయ భూముల్లో విద్యుత్తు తీగల కింద సుబాబుల్, జామాయిల్‌ను సాగు చేయడమే దీనికి కారణమని సిబ్బంది చెప్తున్నారు. కరెంట్ పోల్స్‌కు సమీపంగా పెరుగుతున్న ఈ చెట్ల వల్ల విద్యుత్‌ విభాగానికి శ్రమతోపాటు ఆర్థిక నష్టమూ సంభవిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్తుశాఖ నిబంధనల ప్రకారం 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్తు లైన్లు కింద చెట్లు వేయకూడదు. భవనాలు నిర్మించకూడదు. కానీ నిబంధనలను అతిక్రమించి అన్ని ప్రాంతాల్లో తోటలు పెంచడం, కట్టడాలను నిర్మిస్తుండడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో కొంతకాలంగా సుబాబుల్, జామాయిల్, ఇతర చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలకు తగలడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
సాధారణ ట్రిప్పు జరిగినపుడు విద్యుత్తు సిబ్బంది ఎక్కడ జరిగిందో తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తారు. అయితే గాలివాన వచ్చినపుడు మాత్రం వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు, గాలులప్పుడు సుబాబుల్‌ చెట్లు తీగలపై వాలిపోతున్నాయి. చెట్ల బరువుకు పలు స్తంభాలు సైతం విరిగిపోయాయి. తీగలు తెగిపడుతుండడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంటోంది. వీటిని సకాలంలో గమనించకపోతే రైతులు, మూగజీవాలకు ప్రాణాపాయం ఉంటుంది.
సమస్యను గుర్తించే వరకు ఫీడర్‌లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యల్లో ఉప కేంద్రంపై భారం పడటమే కాకుండా విద్యుత్తు నియంత్రికలు కాలిపోతున్నాయి. ఒక్కోసారి వినియోగదారులు రెండు, మూడు రోజుల వరకు విద్యుత్తు సరఫరా కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఇక వీటికి  మరమ్మతుల ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఈ సమస్య పరిష్కారంపై సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.
అయితే రైతుల సహకారంతోనే ఇబ్బందిని అధిగమించగలమని అధికారులు అంటున్నారు. వర్షాలు, గాలులు వచ్చినపుడు ఈ చెట్లు తీగలపై పడటం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా స్తంభాలు విరుగుతున్నాయని చెప్తున్నారు. రైతులు విద్యుత్తు లైన్ల కింద ఉన్న చెట్లను తొలగిస్తే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు. తమ సూచనలను సుబాబుల్, జామాయిల్‌ రైతులు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు.
Tags:Wandering the gangs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *