వడి వడిగా.. (వరంగల్)

Date;28/02/2020

వడి వడిగా.. (వరంగల్)

వరంగల్ముచ్చట్లు:

గోదావరి నది జలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే గోదావరి నీటిని నిలిపేలా పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ పనుల పూర్తిపై మార్గదర్శనం చేస్తున్నారు. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంగనర్‌ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని దించాలని ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారు. అయితే కంతనపల్లితో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం  ప్రాంతానికి మార్చారు. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో ఇప్పటికే రూ.1,100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్‌ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 58 గేట్ల తయారీ పూర్తయింది. ఆదివారం నుంచి వాటిని అమర్చే  ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ చివరి నాటికి ఈ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్‌ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్‌ నిర్మాణాలు  పూర్తవ్వగా, వాటి మధ్యలోంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. దీని ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వలను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ చేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ మరమ్మతులపై బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన తుపాకులగూడెం చేరుతుంది. మేడిగడ్డ నుంచి వచ్చే నీరంతా తుపాకులగూడెంలో నిల్వ ఉండేలా బ్యారేజీ స్లూయిస్‌ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్‌ వరకు పూర్తి చేయాలని, ఈ లెవల్‌లో 2.90 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని సీఎం గతంలోనే సూచించగా, ఈ పనులను ఇటీవలే ముగించారు.
వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 83 మీటర్ల మేర నీటిని 6.94 టీఎంసీల నిల్వ చేసేలా
పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, ఆ పనులు వేగిరమయ్యాయి. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దీనికింద నిర్ణయించి 6.21 లక్షల ఎకరాల
ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. అయితే దేవాదులలోని మూడో దశ పనులు పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు నీరందించే అవకాశాలుండటంతో ఆ పనులను
వేగిరం చేశారు.

Tags;(Warangal)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *