వామ్మో… సాంఘీక హాస్టళ్లు

Date:17/03/2018
ఒంగోలు ముచ్చట్లు:
ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారు అరకొర వసతులతోనే సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభం ముందుగానే వసతిగృహాల్లో మరమ్మతు పనులు చేపట్టాలని సంబంధిత వసతిగృహ సంక్షేమాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఆలస్యంగా నవంబరు నెలలో నిధులు మంజూరు చేసినా ఇంతవరకు మరమ్మతు పనులకు మోక్షం లభించలేదు. ఇంజినీరింగ్‌ అధికారులు కొన్ని వసతిగృహాల్లో పనులను గుత్తేదారులకు అప్పగించి మొదలు పెట్టినా మిగిలినవి పట్టించుకోవడం లేదు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా, 16 వసతిగృహాల్లో మరమ్మతు పనులు ప్రారంభమే కాలేదు.సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలకు తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలని వసతిగృహ సంక్షేమాధికారుల అభ్యర్ధన మేరకు ఏపీఇడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు వచ్చి పరిశీలించి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. నీటి వసతి కోసం బోర్లు, ప్రధానంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు, వసతిగృహంలోని ఫ్లోరింగ్‌ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు, విద్యుదీకరణ చేయాలని మొత్తం 49 వసతిగృహాల్లో మరమ్మతు పనులకు ప్రణాళికలు రూపొందించి పంపారు. మరమ్మతులు చేయడానికి అవసరమైన రూ.1.95 కోట్ల నిధులను ప్రభుత్వం నవంబరు నెలలో మంజూరు చేసింది.ప్రీ మెట్రిక్‌ వసతి గృహాల్లో మూడు నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థులు ఉంటారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగుస్తుండగా సంవత్సరాంత పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో సరైన విద్యుదీకరణ లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలినంత వెలుతురు లేక ఒకవైపు పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సమస్యలతోనే కాలం వెల్లదీస్తున్నారు.సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో 49 సొంత భవనాలుంటే వాటికి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిధులిచ్చింది. ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ విద్యా సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ) ఇంజినీర్లకు మరమ్మతు పనులు అప్పగించింది. 20 వసతి గృహాల్లో ఒప్పందాలు కుదిరి మరమ్మతు పనులు చేపట్టారు. 13 వసతిగృహాల్లో ఒప్పందాలు కుదిరి గుత్తేదారులకు పనులు అప్పగించి కొన్ని ప్రారంభించగా మరికొన్ని మొదలు కావాల్సి ఉంది. మిగిలిన 16 వసతిగృహాల్లో పనులకు ఇప్పటికే నాలుగుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో మరమ్మతు పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
Tags: Warmo … socialist hostels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *