వ్యర్థాల నిర్వహణ ఒక బాధ్యత-మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడ ముచ్చట్లు:
సుస్థిర వ్యర్థ నిర్వహణ పై ఎస్వీ విశ్వవిద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ సదస్సుకు సుమారు 51 దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు. ఈ సందర్భంగా వ్యర్థాల నిర్వహణ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి పట్ల మానవాళి అమర్యాదతో ప్రవర్తించడంతో ఇప్పుడు భూతాపం, వరదలు, తుఫాన్ లు లాంటి విపత్కర పరిస్థితిని ఎదురుకుంటున్నాం. మంచి ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం కోసం ఒక మంచి స్వచ్చమైన వాతావరణం అవసరమని అన్నారు. సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యర్థాల నిర్వహణ ముఖ్యం. వ్యర్థ నిర్వహణ ఒక బరువు గల బాధ్యతగా కాకుండా ఒక అవకాశం లా చూడాలి. తద్వారా అనేక మందికి ఉపాధి లభించడం తో పాటుగా గ్రీన్ హౌజ్ గ్యాస్ లను తగ్గించ వచ్చు. స్వీయ సుస్థిర వ్యర్థ నిర్వహణ మాత్రమే ఇందుకు పరిష్కారం . ఏపీలో 123 మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, నగరపంచాయత్లు ఉన్నాయి. ఇందులో సుమారు 1.49 కోట్ల పట్టణ జనాభా, 44.57 లక్షల గృహాలు ఉన్నాయి. క్లీన్ ఆంధ్ర మిషన్ (క్లాప్) ద్వారా వ్యర్థ రహిత నగరాలుగా వీటిని తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రిశ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారు.
ఇందుకోసం 3648 హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లు, డీజల్ మరియు ఎలెక్ట్రిక్ ఆటోలు, 24 వేల రిక్షాలు అందించాం. వీటి ద్వారా సుమారుగా రోజుకు 7 వేల టన్నుల వ్యర్ధాలను తరలిస్తున్నామని అన్నారు.ఇవేకాక 2.43 లక్షల టాయిలెట్స్, 623 పబ్లిక్ టాయిలెట్స్, 795 కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. వీటన్నిటి ద్వారా క్లాప్ సుమారుగా 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో 48 మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అందుబాటులో ఉన్నాయి. మరో 59 నిర్మాణ దశలో ఉండగా, అదనంగా 206 టెండర్ దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తో రాష్ట్రంలో 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల చెత్త బుట్టలు అందించాం. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సుమారు 2 కోట్ల చెత్త భుట్టలు అందించేందుకు రంగం సిద్దం చేస్తున్నాం. వ్యర్థాల నుండి విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రోజుకు 2400 టన్నుల వ్యర్థ నుండి 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వ్యర్థాల నిర్వహణ పై ప్రజల్లో అవగాహన పెరగాలి, చైతన్యం రావాలి. తద్వారా మరింత మంచి వాతావరణం నెలకొంటుందని అన్నారు.

Tags: Waste management is a responsibility-Minister Peddireddy
