నీటి గండం 

Date:14/03/2018
మహబూబ్ నగర ముచ్చట్లు:
జిల్లాలో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. వేసవి ప్రారంభం కాక ముందే గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమయింది. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోర్లు పని  చేయడం లేదు. సగానికి పైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని బోర్లు ఎండిపోతుండడంతో ట్యాంకర్ల ద్వారా, పొలాల నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులు మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో మంచినీటి కోసం జిల్లావాసులు అవస్థలు పడక తప్పదు. జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్‌, హన్వాడ, కురుమూర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో 20 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో పాటు భూత్పూర్‌, కుల్కచర్ల, కోడూరు, నర్వ, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో కూడా 15 మీటర్ల లోతుకు జలాలు అడుగంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్ర రూపం కానుంది. మిగితా ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు తాగునీటికి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏప్రిల్‌ నాటికి నీటి సమస్య తీవ్రం కానుంది. ఒకవైపు వ్యవసాయ బోర్లకు 24గంటల విద్యుత్తు సరఫరాతో బోర్లు నిరంతరం నడుస్తుండడంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. ప్రజలకు ట్యాంకర్లు, ప్రైవేటు బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది వీటి ద్వారా నీటి సరఫరా చేసిన వాటికి బిల్లులు ఇవ్వకపోవడంతో ఈ సారి బోర్లు, ట్యాంకర్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.ప్రభుత్వం ఓ వైపు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి కొళాయి నీటిని ఇస్తామని పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడా పూర్తి కావడం లేదు. ఓ వైపు జలాశయాల్లో నీటి నిల్వలు కూడా పడిపోతున్నాయి. రెండు, మూడు నెలల్లో ఇంటింటికి రక్షిత నీరు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. పైగా అధికారులు మిషన్‌ భగీరథ పేరుతో వేసవి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ వేసవిలో తాగునీటికి చుక్కలు కనిపించే అవకాశం లేకపోలేదు.
Tags: Water body

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *