Natyam ad

పరిశ్రమలకు  నీటి భారం

నెల్లూరు ముచ్చట్లు:


రాష్ట్రంలోని పరిశ్రమలకు అందిస్తోన్న నీటికి వసూలు చేస్తోన్న ఛార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్న తేడా లేకుండా వాటిన్నింటినీ ఒకేగాట్టిన కట్టింది. అన్నింటికీ ఆరు రెట్లు నీటి సరఫరా ధరను పెంచుతూ ఈ ఏడాది జనవరి 12న జిఒ నెంబరు ఒకటిని విడుదల చేసింది. నీటి ఛార్జీల పెంపుపై పరిశ్రమల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో ఈ జిఒ వ్యవహారం బయటకొచ్చింది. పెంచిన ధర అమల్లోకి వస్తే పరిశ్రమలపై కోట్ల రూపాయల నీటి భారం పడనుంది. తామీ భారం భరించలేమని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పలు పరిశ్రమలకు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)కు విశాఖపట్నం ఇండిస్టియల్‌ వాటర్‌ సప్లై కంపెనీ (విస్కో) నీటిని సరఫరా చేస్తోంది. నీటి ధర పెంపుపై వెంటనే అమల్లోకి వెళ్లకుండా ముందుగా పరిశ్రమల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో, నెల రోజుల క్రితం పరిశ్రమల ప్రతినిధులతో విస్కో అధికారులు సమావేశం నిర్వహించారు.

 

 

 

ప్రస్తుతమున్న ధరకు ఆరు రెట్లు పెంచడం వల్ల పరిశ్రమలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్న ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించారు. కొత్త జిఒ అమల్లోకి వస్తే పరిశ్రమలకు విస్కో సరఫరా చేస్తున్న నీటి ధరలు పెరగనున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు 25 మిలియన్‌ గ్యాలన్స్‌ ఫర్‌ డే (ఎంజిడి), ఎన్‌టిపిసి, ఎపిఐఐసికి 6.7 ఎంజిడి, గంగవరం పోర్టుకు 0.3 ఎంజిడి నీటిని విస్కో సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌టిపిసి, స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేస్తున్న వెయ్యి లీటర్ల నీటికి రూ.19.22 చొప్పున వసూలు చేస్తోంది. ఎపిఐఐసి, గంగవరం పోర్టు నుంచి వెయ్యి లీటర్ల నీటికి రూ.20 చొప్పున సరఫరా చేస్తోంది. రూ.19.22 చొప్పున 25 ఎంజిడిల నీటికి రోజుకు సుమారు 21.84 లక్షల రూపాయలు స్టీల్‌ప్లాంట్‌ చెల్లిస్తోంది. కొత ధర అమల్లోకి వస్తే 1.36 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లూ పని చేస్తే రోజుకు 40 ఎంజిడిల నీరు అవసరం కానుంది. ఆ మేరకు నీటి భారం మరింత పెరగనుంది. విస్కో సరఫరా చేస్తోన్న నీటిని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం, రాంబిల్లిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌), నాన్‌ సెజ్‌లోని పరిశ్రమలకు ఎపిఐఐసి అందిస్తోంది. ఎపిఐఐసి ప్రస్తుతం రూ.20 చొప్పున 6.7 ఎంజిడిలకు రోజుకు 6.09 లక్షలు చెల్లిస్తుండగా, పెరిగిన ధర అమల్లోకి వస్తే రూ.36.54 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం తామింకా పాత ధర ప్రకారమే నీటిని సరఫరా చేస్తున్నామని విస్కో అధికారులు ‘ప్రజాశక్తి’కి తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాక పెంచిన ధర వర్తింపజేస్తామన్నారు.

 

Tags: Water burden for industries