నిబంధనల మేరకే నీటి నిలువ

Date:13/03/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నందిమేడారం చెరువు పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతలకు కావాల్సిన నీటిని నిల్వ చేసుకునేలా పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 3 నుంచే నీటిని చెరువులోకి ఎత్తిపోస్తున్నారు. ఇదిలాఉంటే హడావుడిగా చేపట్టిన పనులతో గతంలో ఓసారి కట్ట కుంగిపోయింది. ప్రస్తుతం పనులు జరుగుతుండగానే చెరువులోకి ఎల్లంపల్లి నీటిని తరలిస్తుండటంతో కట్ట పటిష్టతపై స్థానికుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. నందిమేడారం చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం 233 మీటర్లు. ప్రస్తుతానికి 225.5 మీటర్ల మేరకు నిల్వ చేశారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 70 చెరువులను నింపడమే లక్ష్యంగా 9వ తేదీ నుంచే నీటికి ఎగువకు ఎత్తిపోస్తున్నారు. చెరువులో నీటిమట్టం పెంచాలని ఎల్లంపల్లి అధికారులు కోరుతుండగా, పనులకు ఆటంకం కలుగుతుందనే ఆలోచనతో అంతకు మించి నింపేందుకు కాళేశ్వరం అధికారులు వెనకాడుతున్నారు. పనులు పూర్తవకముందే ఎక్కువ నీటిని నింపితే ఇబ్బందులు తప్పవు. దీంతో మరో వారంలోగా రాళ్లతెట్టె పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఎత్తిపోతలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. నీరు అధికంగా ఉండడంతో ఎల్లంపల్లి నిండుకుండను తలపిస్తోంది. అయితే ఎగువన సాగు చేసిన పంటలు మాత్రం ఎండిపోతున్నాయి. పంటలను రక్షించేందుకుఎగువకు ఎత్తిపోతలు మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మేడారం చెరువులో ఎత్తిపోతలకు సరిపడేలా కట్ట నిర్మాణం పనులు పూర్తి చేసి ఎగువకు ఎత్తిపోయాలని ఆదేశాలిచ్చింది. పనులు పూర్తయిన మేరకు నీటిని నిల్వ చేయడంతో ఒక పంపు మాత్రమే సజావుగా నడుస్తోందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కట్ట నిర్మాణం కొత్తది కావడంతో, 225.5 మీటర్లకు మించి నీటికి నింపితే ఇబ్బందులు వస్తాయన్న భావన నెలకొంది. గ్రావెల్‌ తేమ పీల్చుకుని రాళ్ల తెట్టె పేర్చే పనులకు ఆటంకం కలిగే ఆస్కారముందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న నీటిమట్టంతోనే సరిపెట్టుకోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు భావిస్తున్నారు. చెరువులోకి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో స్థిరంగా ఉండేలా చూడటంతో పాటు రాళ్ల తెట్టె పనులు త్వరగా పూర్తి చేస్తే నీటి మట్టం పెంచే అవకాశం ఉంటుంది. 226.8 మీటర్ల మేరకు నీటిని నిల్వ చేయవచ్చు. అదే జరిగితే నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఎలాంటి లోటూ ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఈ దిశగా దృష్టి సారించి ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేసి సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
Tags: Water storage for rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *