ప్రాజెక్టులుకు పూర్తి స్థాయిలో చేరని నీరు

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

వానాకాలం మొదలై 50 రోజులు దాటింది. వానల్లేవు, వరదల్లేవు. దీంతో గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో ఒక్క వాగు కూడా పొంగలేదు. ఉప నదుల నుంచి ప్రధాన నదుల్లోకి ప్రవాహాలు చేరలేదు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోయి కనిపిస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌, ఎల్లంపల్లిలోకి గరిష్టంగా 2 టీఎంసీల చొప్పున నీళ్లు చేరగా, మిగతా ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ ఇన్‌ఫ్లో లేదు. గతేడాది జులై 20 నుంచి 26 మధ్య శ్రీశైలం ప్రాజెక్టులోకి ఏకంగా వంద టీఎంసీల నీళ్లు చేరాయి. కానీ ఇప్పుడు ఎగువన కర్నాటక నుంచి వరద వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఈ సీజన్‌లో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో జూరాలకు 0.13 టీఎంసీలు, శ్రీశైలం జలాశయానికి 0.34 టీఎంసీలు, నాగార్జున సాగర్‌కు 2.58 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లో సింగూరుకు 0.20 టీఎంసీలు, నిజాంసాగర్‌కు 0.06 టీఎంసీలు, మిడ్‌ మానేరుకు 0.10 టీఎంసీలు, కడెం ప్రాజెక్టుకు 0.82 టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2 టీఎంసీల నీళ్లు చేరాయి.పది రోజుల క్రితం మహారాష్ట్ర, కర్నాటకలో   వర్షాలకు ఆల్మట్టికి వరద పోటెత్తగా క్రమంగా ఇన్‌ఫ్లో పడిపోతోంది. ఆల్మట్టి కెపాసిటీ 129.72 టీఎంసీలు కాగా, శనివారం 115.40 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 26,299 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది.

 

 

 

 

ఆల్మట్టి నుంచి 962 క్యూసెక్కుల నీటిని  వదులుతున్నారు. ఇక నారాయణపూర్‌ ప్రాజెక్టు కెపాసిటీ 37.64 టీఎంసీలు కాగాసాయంత్రానికి 34.56 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోయిందిగతేడాది కృష్ణా డెల్టాను ఆదుకున్న తుంగభద్ర ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.11 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ప్రాజెక్టులోకి 5,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గతేడాది జులై 20 నుంచి 26వ తేదీ మధ్య శ్రీశైలం ప్రాజెక్టులోకి వంద టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. వరద పోటెత్తడంతో శ్రీశైలం త్వరగా నిండింది. 1.76 లక్షల క్యూసెక్కులతో మొదలైన ప్రవాహం ఒక దశలో 2.11 లక్షల క్యూసెక్కులకు చేరింది. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తి రివర్స్. ఈ నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల్లో పెద్దగా ప్రవాహాలు లేకపోవడంతో ఇప్పట్లో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు వరద రావడం అనుమానమే. ఆల్మట్టి నిండేందుకు మరో 14.32 టీఎంసీలు, నారాయణపూర్‌ నిండేందుకు మరో 3.08 టీఎంసీలు అవసరం.వర్షాలు లేక మేజర్‌ ప్రాజెక్టులే కాదు చెరువులు, కుంటలు కూడా వట్టిపోయి కనిపిస్తున్నాయి.

 

 

 

 

రాష్ట్రంలో 44,768 చెరువులు, కుంటలు ఉండగా, ఇప్పటి వరకు ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. కృష్ణా బేసిన్‌లో 23,768 చెరువులు, గోదావరి బేసిన్‌లో 21 వేల చెరువులు ఉన్నాయి. గతేడాది ఆగస్టు మూడో వారం నాటికి గోదావరి బేసిన్‌లో 11,527, కృష్ణా బేసిన్‌లో 314 చెరువులు పూర్తిగా నిండి మత్తడి దుంకాయి. అదే సమయానికి కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులైన సాగర్‌, శ్రీశైలం దాదాపు నిండగా, గోదావరి బేసిన్‌లోని ముఖ్య జలాశయం ఎస్సారెస్పీలోకి దాదాపు 70 టీఎంసీల వరద వచ్చింది .ప్రాణహితలో కాస్త ప్రవాహం కనిపిస్తోంది. పది రోజుల క్రితం 13 వేల క్యూసెక్కులకు పైగా వరద రాగా ప్రస్తుతం 9,500 వేల క్యూసెక్కులకు పడిపోయింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్లను ఆపి, అన్నారం పంపుహౌస్‌లో మొదటి మోటారును నడిపించి నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. మేడిగడ్డలో 7 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, 3 గేట్లను ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదలుతున్నారు. అన్నారం బ్యారేజీలో 7 టీఎంసీల నిల్వ ఉంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు.

 

Tags: Water that is not fully accessible to projects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *