నీటి ముప్పు (చిత్తూరు)

Date:17/09/2018
చిత్తూరుముచ్చట్లు:
హార్సిలీ హిల్స్‌ కు నీటి ముప్పు ముంచుకొస్తోంది.. వరుణుడి కరుణ లేక బోర్లలో నీటిమట్టం క్రమంగా పడిపోతోంది.. దుర్భిక్షం తీవ్రత అధికమవుతుండటంతో కొండపైకి నీటి పంపింగ్‌ తగ్గిపోయి.. ఇప్పటికే సమస్య ప్రారంభమైంది..వానాకాలమైనప్పటికీ నీటి గండాన్ని గట్టేక్కే ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు.. ఈ సీజన్లో వానలు కురవకపోతే రానున్న రోజుల్లో హార్సిలీహిల్స్‌పై నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
బి.కొత్తకోట, న్యూస్‌టుడే: బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీలోని హార్సిలీహిల్స్ కు ఏడాది పొడవునా పర్యాటకులు రాకపోకలు సాగిస్తున్నారు. వేసవి సీజన్‌ ప్రారంభమైతే కొండపైకి వచ్చే పర్యాటకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. కొండపై ఉన్న పర్యాటక, అటవీశాఖలతో పాటు ప్రైవేటు అతిథి గృహాల్లో బస చేసి వెళ్లడం అనవాయితీగా వస్తోంది.
అలాగే కొండపై వివిధ శాఖల ఉద్యోగులతో పాటు స్థానికులు స్ధిరపడ్డారు. ప్రతిరోజూ 50 వేల లీటర్లకు పైగా నీరు అవసరమవుతుందని అధికారుల అంచనా వేసి ట్యాంకులను నిర్మించారు. వేసవికాలంలో ఈ వినియోగం భారీగా పెరుగుతుంది. ప్రస్తుత సీజన్లో 148 శాతం వర్షపాతం తగ్గినట్లుగా అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. బోర్లలో నీటిమట్టం శరవేగంగా పడిపోతుండటంతో గ్రామాలతో పాటు కొండపైన నీటి సమస్య ఉత్పన్నమవుతోంది.
హార్సిలీహిల్స్‌ కు నీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం ఉంది. కొండకింద ఉన్న గాలేటివారిపల్లె వద్ద నుంచి ఏడు కిలోమీటర్ల దూరం పైపులైనును నిర్మించారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఏడు పంపింగ్‌ కేంద్రాల ద్వారా నీటిని కొండకు తరలిస్తున్నారు. గాలేటివారిపల్లె వద్ద ఉన్న బోర్ల నుంచి నీరు కొండపైకి చేరి వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది.
గాలేటివారిపల్లె వద్ద ఉన్న ఏడు బోర్లలో ఇప్పుడు కేవలం మూడు మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలోనూ వచ్చే నీళ్లు బాగా తగ్గిపోయాయి. తరచుగా మోటార్లను ఆపి రాత్రింబవళ్లు నీటిని కొండపైకి తరలించాల్సి వస్తోంది. నీటి పంపింగ్‌ తగ్గడంతో కొండపై సరఫరా చేసే నీటి పరిమాణం తగ్గిపోయింది. కాగా అటవీ ప్రాంగణంలో ఉన్న మాసన సరోవరంలో నీళ్లు అడుగంటాయి. దీంతో తోటలకు సరఫరా అయ్యే నీరు తగ్గిపోతున్నాయి.
హార్సిలీహిల్స్‌కు హంద్రీ-నీవా జలాలను తరలించడానికి పంచాయతీరాజ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేశారు. కొండను ఆనుకుని వెళ్తున్న హంద్రీ-నీవా కాలువ నుంచి నీటిని తెట్టు వద్ద ఉన్న ఓ చెరువుకు మళ్లిస్తారు. అనంతరం శుద్ధి చేసిన నీటిని ఇప్పుడున్న పైపులైను ద్వారా కొండపైకి నీటిని ఎత్తిపోతల ద్వారా పంపుతారు.
రూ.3 కోట్లతో ఈ పథకాన్ని అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.ఈ పథకాన్ని చేపడితే హార్సిలీహిల్స్‌కు నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం వల్ల గాలేటివారిపల్లె  వద్ద ఉన్న బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని, అవసరమైతే మోటార్ల సామర్థ్యాన్ని పెంచువచ్చునని సూచిస్తున్నారు.
రెండేళ్ల క్రితం అధికారులు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపగా..ఇప్పటివరకు ఆమోదముద్ర లభించలేదు. హంద్రీ-నీవా జలాలు అందుబాటులోకి వస్తే  అటవీ మార్గంలో సిమెంటు తొట్టెలను నీటిని నింపితే జంతువుల దాహార్తి తీరుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా హంద్రీ-నీవా తాగునీటి పథకానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. కాగా కొండపై తాగునీటి అవసరాలు భారీగా పెరగనున్నాయి.
Tags:Water threat (Chittoor)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *