అడవిలో ప్రతి రెండుకిలోమీటర్ కు నీటి వసతి

Water to every two kilometers in the forest

Date:16/04/2019

వరంగల్ ముచ్చట్లు :
రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. బోరుబావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వాగులు, వంకలు ఇంకుతున్నాయి. ఆకులు రాలిపోయి అడవులు బోసిపోతున్నాయి. ఫలితంగా వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4,73,487 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. మహదేవ్‌పూర్‌, పలిమెల, తాడ్వాయి, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లో జింకలు, దుప్పులు, కుందేళ్లు, నీలుగాయిలు, నక్కలు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, అడవి పందులు జీవిస్తున్నాయి. వేసవి కాలం వచ్చిందంటేఇవి గ్రాసం, తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  ఈ నేపథ్యంలో వీటి దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ రక్షణ చర్యలు తీసుకొంటోంది.ఏటూరునాగారం అభయారణ్యంలో ప్రతి 2 చ.కి.మికి, సాధారణ అడవుల్లో ప్రతి 3 చ. కి.మికి ఒక నీటి వసతిని అధికారులు కల్పిస్తున్నారు. ఇందుకోసం సోలార్‌ పంపులు, సాసర్‌ పిట్లు, నీటి కుంటలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటితో పాటుగా కరకట్టలు నిర్మించి వాటిలో నీటిని నింపుతున్నారు. వాగులు, సెలయేళ్లలో చెలిమలు సైతం తీస్తున్నారు. ఆరు డివిజన్లలో ఇప్పటి వరకు 718 నీటి వసతులు కల్పించాల్సిన ప్రాంతాలను గుర్తించారు. 273 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 115 కుంటలను తవ్వించారు. మరో 152 చోట్ల నీటి వసతికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పక్షుల కోసం చెట్లపైన నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు.వేసవిలో అడవుల్లో ఉన్న వృక్షాలు ఎండిపోయి బోసిగా ఉంటాయి. ఇదే అదనుగా వేటగాళ్లు జంతువుల కోసం కాచుకొని ఉంటారు. నీటివనరుల వద్దకు దాహార్తి తీర్చుకునేందుకు వచ్చే వన్యప్రాణులకు వేటాడుతుంటారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు అడవుల్లో కెమెరాట్రాప్‌లు పెడుతున్నారు. వన్యప్రాణుల కదలికలతో పాటు, వేటగాళ్లపైనా పర్యవేక్షణ ఉంటుంది. సిబ్బందితో గస్తీ చేపడుతూ నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.
TagsWater to every two kilometers in the forest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *