మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తున్నాం.

We are getting closer to technology.
-మంత్రి జూపల్లి కృష్ణారావు
Date:14/06/2018
హైదారాబాద్ ముచ్చట్లు:
గ్రామ స్థాయిలో మహిళాసంఘాల కార్యకలాపాలన్ని పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లడంలో భాగంగా మహిళాసంఘాలకు ట్యాబ్లెట్ పీసీలను అందజేస్తున్నామని పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో స్త్రీ నిధి బ్యాంకు ద్వారా గ్రామ మహిళాసంఘాలకు ట్యాబ్లెట్ పీసీ లను గురువారం మంత్రి జూపల్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తున్నామని, ఈ ట్యాబ్లెట్ పీసీల ద్వారా రుణాల కోసం గ్రామం నుండే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఆధార్, ఐరిస్ అథెంటికేషన్ సౌకర్యాన్ని కూడా ట్యాబ్లెట్ పీసీల్లో పొందుపరిచామని, తద్వారా ఉన్న చోటునుండే రుణానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసుకోవచ్చన్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ ల (వీఓ) ఆర్ధిక కార్యకలాపాలన్నీ పారదర్శకంగా, వేగంగా జరిపేందుకు ట్యాబ్లెట్ పీసీలు దోహదపడతాయన్నారు. భవిష్యత్ లో ఆసరా ఫించన్లు, ఉపాధి కూలీ చెల్లింపు కూడా వీఓ ల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్త్రీ నిధి బ్యాంకు పనిచేస్తోందని, ఇప్పటివరకు దాదాపు 6 వేల కోట్ల రుణాలను మహిళాసంఘాలకు అందజేయడం అభినందనీయం అన్నారు. గతేడాది 1850 కోట్ల రుణాలను అందజేసిన స్త్రీ నిధి బ్యాంకు, ఈ ఆర్ధిక సంవత్సరంలో 2300 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బంగారుతెలంగాణ సాధనలో స్త్రీ నిధి బ్యాంకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని, స్త్రీ నిధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికరతకు, ఆర్ధిక పురోగతికి స్త్రీ నిధి బ్యాంకు కృషి చేస్తోందని, స్త్రీ నిధి పురోగతికి  ప్రభుత్వం అందజేస్తున్న సహకారానికి  ఛైర్ పర్సన్ అనిత కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ… వీఓల బుక్ కీపింగ్ తో పాటు లోన్ పత్రాలు అప్ లోడ్, బ్యాంకు లింకేజీ లాంటి కార్యకలాపాలకు ఉపయోగపడేలా ట్యాబ్లెట్ పీసీలు అందజేస్తున్నామన్నారు. దుర్వినియోగం కాకుండా కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉపయోగించేందుకు వీలుగా ఈ ట్యాబ్లెట్ పీసీల్లో ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సెర్ప్ సీఈఓ పౌసమీ బసు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: We are getting closer to technology.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *