ఇవాళ వీఆర్వో పరీక్ష అంతా సిద్ధం

Date:15/09/2018
ఖమ్మం ముచ్చట్లు :
వీఆర్‌వో ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు.. గ్రామ రెవెన్యూ అధికారి  పోస్టుకు టీఎస్‌పీఎస్సీ రాత పరీక్షలను ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ రాత పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 35,476 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం ఖమ్మం నగరం సహా ఖమ్మం రూరల్‌ మండలం, కొణిజర్ల మండలాల్లో విద్యాసంస్థల్లో 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 97 పరీక్ష కేంద్రాలను 16 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు లైజన్‌ అధికారిగా తహసీల్దారును నియమించారు.
మరో ముగ్గురు తహసీల్దార్లను రిజర్వ్‌లో ఉంచారు. లైజన్‌ అధికారులకు 97 మంది సహాయ లైజన్‌ అధికారులను నియమించారు. 1478 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో 41 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17,523మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
పెద్ద సంఖ్యలో పరీక్ష రాస్తున్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగూడెం డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజన్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
శనివారం ఉదయం కీలక సమావేశంలో మరిన్ని నిర్ణయాలు వెలువడనున్నాయి. పరీక్షల రూట్‌ లైజన్‌ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలను 8రూట్లుగా విభజించిన నేపథ్యంలో ప్రతి రూట్‌కు లైజన్‌ అధికారి, సహాయ లైజన్‌ అధికారిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విద్యాలయాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనుభవం, అర్హత ఉన్నవారికి మాత్రమే ఇన్విజిలేషన్స్‌ బాధ్యతలను అప్పగించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు సూచనలు ఇచ్చారు.
పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు తిప్పాలని ఆదేశించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని అధికారులు ప్రకటించారు.గతంలో జిల్లా అభ్యర్థులు ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు వెళ్లిన అనుభవాలు ఉన్న దృష్ట్యా ఈసారి ఉభయ జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాల్లోనే జంబ్లింగ్‌ పద్ధతిలో రాసే అవకాశం ఉంది.
కేంద్రాలకు సులువుగా చేరుకునే వీలున్న వాటినే ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది.ఖమ్మం, కొత్తగూడెంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, తదితర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ మంది ఖమ్మం, కొత్తగూడెంలో పరీక్ష రాయనున్నారు. ఖమ్మంలో నివాసం ఉండేవారికి కొత్తగూడెం, కొత్తగూడెం జిల్లాలో నివాసం ఉండే వారికి ఖమ్మంలోని పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యేవిధంగా హాల్‌టిక్కెట్లు జారీ అయ్యాయి.
ఖమ్మం, కొత్తగూడెంలో వీఆర్వో రాత పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఎక్కువగా తెరిచారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఇక్కడి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుని పరీక్ష ఖమ్మం, కొత్తగూడెంలో రాసేందుకు అనువుగా దరఖాస్తు చేసుకున్నారు.ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించటంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త జోనల్‌ విధానం ఖరారు కాకముందు టీఎస్‌పీఎస్సీ వీఆర్వో రాత పరీక్షలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాత జిల్లాల ప్రాతిపదికన పోస్టులు లెక్కించారు.పరీక్ష కేంద్రాలు 31 జిల్లాల్లో ఏర్పాటు చేయటంతో ఆయా జిల్లాల వారీగా అధికార యంత్రాంగం పరీక్షలు నిర్వహించనుంది.పరీక్ష కేంద్రాలు తెలిసే విధంగా ఆయా కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు.
Tags:We are preparing the Vairavo test today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *