రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తయారుచేసాం

We have made the state a number one welfare state in the country

We have made the state a number one welfare state in the country

-ఉప ముఖ్యమంత్రి, మంత్రి కడియం శ్రీహరి
Date:16/04/2018
వరంగల్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారు చేస్తున్న బస్సు యాత్ర దోపిడి చేయడం కోసం, మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడడం కోసమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు కొనియాడుతుంటే…ఇక్కడకు వచ్చి చూసి ప్రశంసిస్తుంటే…రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కళ్లకు మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలోని అభివృద్ధి కనిపించకుండా కేవలం సిఎం సీటు మాత్రమే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి జిల్లా ఆరెపల్లి గ్రామంలో మూడు కోట్లరూపాయలతో నిర్మించిన గోదామును ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక నేతలు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం ప్రసంగించారు.కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తయారుచేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ వస్తే కరువు కాటకాలు వస్తాయని, కరెంటు లేక చీకట్లు కమ్ముకుంటాయని, రైతులు వ్యవసాయం లేక అన్నమో రామచంద్రా అని అలమటిస్తారని గత పాలకులు ఇష్టం వచ్చినట్లు చెప్పారని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయంపై, రైతుల సంక్షేమంపై ప్రతినిమిషం ఆలోచించి అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 36లక్షల మంది రైతులకు 16.50 లక్షల కోట్ల రూపాయలను పంటరుణాలు మాఫీ చేశారని తెలిపారు. గతంలో ఎరువులు, విత్తనాలకు చెప్పులు క్యూలో పెట్టి నిల్చుండే పరిస్థితి లేకుండా చేశారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని చెప్పిన వారి చెంప చెల్లుమనేలా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు కూడా వ్యవసాయానికి నేడు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. రైతులు వ్యవసాయం కోసం అప్పులు చేస్తున్నారని గుర్తించి, రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి 8000 రూపాయలను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎనాడైనా ఇవి చేశారా? అని ప్రశ్నించారు.నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే…ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అంటున్నారు. దీనిని నిజం చేసేందుకు నియోజక వర్గానికి లక్ష ఎకరాలను, రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను దేశం మొత్తం హర్షిస్తోందన్నారు. ఒక్క రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పనులకోసం రెండు లక్షల సిమెంట్ బస్తాలను ఉపయోగిస్తున్నారంటే ఆ ప్రాజెక్టు పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయం కోసం అప్పులు చేస్తున్నారని గుర్తించిన సిఎం కేసిఆర్ …వారికి అలాంటి పరిస్థితి ఉండొద్దని వ్యవసాయం పండగ కావాలని, రైతు రాజు కావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలను పంట పెట్టుబడిగా ఇస్తున్నారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేస్తున్నారా? అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 15 లక్షల ఎకరాలకు పంట పెట్టుబడి ఇచ్చే విధంగా బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయలను కేటాయించారన్నారు.ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను 1, 024 కోట్ల రూపాయలతో నిర్మించుకున్నాం. కాంగ్రెస్ వాళ్లు ఏనాడైనా దీని గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. కళ్లముందు ప్రజలకు ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తుంటే…కళ్లున్న కబోదిలు కాంగ్రెస్ వాళ్లు మాత్రం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండడం మీ అదృష్టమని, ఆయన కాకుండా ఎవరున్నా భూపాలపల్లిలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదన్నారు.మళ్లీ ఈ అభివృద్ధి కొనసాగాలంటే సిఎంగా కేసిఆర్ ను, ఎమ్మెల్యేగా మధుసూదనాచారిని గెలిపించాలని, కాంగ్రెస్ సన్నాసుల మాట వినొద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు. 
Tags:We have made the state a number one welfare state in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *