పౌరసరఫరాలో కొత్త ఒరవడికి పునాది వేశాం 

-రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు
-మంత్రి ఈటెల రాజేందర్
Date:22/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పౌరసరఫరాల్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను అరికట్టి, లోపాలను అధిగమించి కొత్త ఒరవడికి పునాది వేయడం జరిగిందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి  ఈటెల రాజేందర్ అన్నారు. పౌరసరఫరాల శాఖ చేపట్టిన ఐటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.  2017-18 రబీ కార్యాచరణపై గురువారం నాడు మంత్రి ఈటెల రాజేందర్ కమిషనర్ సి.వి. ఆనంద్తో కలిసి జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈపాస్ నెట్వర్క్ సమస్యలు, రేషన్ పోర్టబిలిటీ, గోదాముల్లో సిసి కెమెరాల పనితీరు పరిశీలన, కిరోసిన్ బకాయిల వసూలు, దీపం కనెక్షన్లు తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో చర్చించారు. గతంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాచేవారని, కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. గత ఏడాది రబీలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పౌరసరఫరాల శాఖ 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఇంత భారీ ఎత్తున ధాన్యం దిగుబడి అయినా కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు రాకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాం.  ఈ రబీలోనూ పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధర లభించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.  పౌరసరఫరాల శాఖ విషయంలో జేసీలు మరింత దృష్టి సారించాలన్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్, గోదాముల్లో సిసి కెమెరాలు, రేషన్ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందన్నారు. బియ్యం అక్రమార్కులపై పీడీ కేసులు సైతం నమోదు చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే విధానం లబ్దిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉందని అన్నారు. దీని వల్ల దూరం సమస్య తీరడంతో పాటు రేషన్ డీలర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. రేషన్ సరుకులు తీసుకెళ్లమని లబ్దిదారుని చుట్టూ డీలర్లు తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. గోదాముల్లో కూడా సంస్కరణలు చేపట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఏప్రిల్ తరువాత కొత్త రేషన్ కార్డుల ముద్రణను ప్రారంభిస్తామని, ఈ కార్డులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించకూడదని, బియ్యం అవసరం ఉన్నవాళ్లే కార్డులు తీసుకోవాలని అన్నారు. పౌరసఫరాల కమిషనర్  సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ రబీలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోనె సంచుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఏ కొనుగోలు కేంద్రంలో ఎన్ని గోనె సంచులు అవసరం అనే విషయాన్ని గుర్తించి ముందుగానే అక్కడ గన్ని సంచులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గతంలో ఐటీ ప్రాజెక్టుల అమలులో తెలంగాణ పౌరసరఫరాల శాఖ దేశంలో 24వ స్థానంలో ఉండగా, నేడు మొదటి స్థానానికి చేరిందని కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల అధికారులు తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపట్టిన ఐటి ప్రాజెక్టులను అధ్యయనం చేయడం జరిగిందన్నారు.  ఆహార భద్రత కార్డుదారులకు మరింత మెరుగైన సేవలు, త్వరితగతిన సరుకులు అందించడానికి  వీలుగా ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కచ్చితంగా వారికి సరుకులు అందేలా చూడాలని, ఈ తేదీ లోపు సరుకుల పంపిణీ ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు.  రాష్ట్రంలో 23 లక్షల మంది ఆహార భద్రత కార్డుదారులకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు లేవని, త్వరితగతిన వీరికి దీపం పథకం కింద ఎల్పిజి కనెక్షన్లు మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని జెసీలకు సూచించారు. ఈ విషయంలో జెసీలు మరింత దృష్టి సారించాలని అన్నారు.  ఎఫ్సిఐ బకాయిలపై దృష్టి సారించాలి ధాన్యం, సిఎంఆర్ రవాణా ఛార్జీలకు సంబంధించి, గోనె సంచుల తరుగుదల, ఆర్డి సెస్, సొసైటీ కమీషన్, నిల్వలు, నిర్వహణ ఛార్జీలకు సంబంధించి వివిధ పద్దుల కింద ఎఫ్సీఐ నుండి రావాల్సిన బకాయిలపై జిల్లా స్థాయిలో జేసీలు ప్రధానంగా దృష్టి సారించాలని, ప్రధానంగా ఎఫ్సిఐ రీజినల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్  సూచించారు.
Tags: We laid the foundation for a new trend in the civil service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *