మీ నిర్ణయాలకు అండగా ఉంటాం – అభివృద్ధి నిరోధకులను అడ్డుకుంటాం
– టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కి టీటీడీ ఉద్యోగ సంఘాల మద్దతు
తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి లో సుమారు లక్ష మంది టీటీడీ, అనుబంధ సంస్థల రెగ్యులర్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. తిరుపతిలో సుమారు 50 శాతం టీటీడీ ఆస్తులు ఉన్నాయి. టీటీడీ బడ్జెట్ లో 1 శాతం నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి తాము అండగా ఉంటామని టీటీడీ లోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తులను బహిరంగంగా అడ్డుకుంటామని వారు చెప్పారు.ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడం పట్ల శనివారం సాయంత్రం వారు చైర్మన్ ను ఆయన నివాసంలో కలసి కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట సుమారు 650 ఎకరాల భూమి సమీకరించి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం కరుణాక రెడ్డి కే సాధ్యం అయ్యిందని వారు చెప్పారు. టీటీడీ బడ్జెట్ లో తిరుపతి అభివృద్ధికి 1 శాతం నిధులు కేటాయించడాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం ఒకరిద్దరు రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.
ఈ అభివృద్ధిని టీటీడీ ఉద్యోగులు, యాత్రీకులు కూడా అనుభవిస్తారని వారు చెప్పారు. పారిశుధ్య కార్మికులకు 5 వేల దాకా, కార్పొరేషన్ ఉద్యోగులకు 3 శాతం జీతం పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వారు అభినందించారు. భవిష్యత్తులో కూడా కరుణాకర రెడ్డి తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని చెప్పారు.చైర్మన్ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమ,అభిమానం వల్లే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. ఉద్యోగులందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి లోని టీటీడీ ఆస్తులపైన మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క రూపాయ కూడా పన్ను వేయడం లేదనే విషయం కూడా అందరూ గుర్తించాలని కోరారు. అలాగే టీటీడీ సంస్థలు, నివాస ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి అభివృద్ధి, భక్తుల సదుపాయాల అభివృద్ధి విషయాల్లో టీటీడీ, మున్సిపల్ కార్పొరేషన్ పరస్పర సహకారంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
Tags: We stand by your decisions – we prevent obstacles to progress
