హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాం- ఏపీ హోం మంత్రి

అమరావతి  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల రద్దు, సీఆర్డీఏ చట్టంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఏపీ హోం మంత్రి సుచరిత తెలిపారు. తాము ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని అన్నారు. అమరావతి  ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని ఆమె అన్నారు. మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు. నిన్న హైకోర్టు తీర్పుపై ఏపీకి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందిస్తూ తీర్పును పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా తాజాగా ఏపీ హోం మంత్రి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలియజేసింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని కోర్టు తీర్పులో వెల్లడించింది.
 
Tags:We will go to the Supreme Court on the judgment given by the High Court- AP Home Minister