Natyam ad

మిల్ల‌ర్ల నుండి బియ్యం కొనుగోలుచేసి అన్న‌ప్ర‌సాదాల‌ నాణ్య‌త పెంచుతాం

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో   ఎవి.ధర్మారెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

బోర్డు నిర్ణ‌యం మేర‌కు మిల్ల‌ర్ల నుండి బియ్యం కొనుగోలు చేసి మ‌రింత నాణ్యంగా అన్న‌ప్ర‌సాదాలు త‌యారు చేస్తామ‌ని టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆదివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. శంకర్ గౌడ్ – హైదరాబాద్

ప్ర‌శ్న : వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు సంబంధించిన ద‌ర్శ‌న టికెట్లు సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈవో : వైకుంఠ ఏకాదశి ప‌ర్వ‌దినాల దర్శన టికెట్లను డిసెంబర్ ద‌ర్శ‌న టికెట్ల కోటాతో కలిపి ఆన్లైన్లో విడుదల చేస్తాం.

2. రాజారామ్ – రాజమండ్రి, వినత – హైదరాబాద్.

ప్ర‌శ్న : సీనియర్ సిటిజన్లకు ఆఫ్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు ఇవ్వండి. అష్ట వినాయక విశ్రాంతి గృహంలో గదుల్లో వసతులు సరిగా లేవు.

ఈవో : వృద్ధులు, వికలాంగుల ద‌ర్శ‌నానికి సంబంధించి కోటా పరిమితంగా ఉంది. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లోనే ఈ టికెట్లు విడుదల చేస్తున్నాం. అష్ట వినాయక విశ్రాంతి గృహంలోని 55 గదులను నాన్ ఎసి చేసి రూ.150/- అద్దె చొప్పున సామాన్య భక్తులకు కేటాయిస్తాం. దీనికి బదులుగా వికాస్ విశ్రాంతి గృహంలో 45 గదులను ఏసీ చేసి గీజర్ వసతి కల్పిస్తాం.

3. నంద్యాల – రామకృష్ణ

ప్ర‌శ్న : మా గ్రామంలోని ఆలయం దేవాలయ శాఖ పరిధిలో ఉంది. ధూప దీప నైవేద్యాలకు సహాయం చేయండి.

ఈవో : ఈ విషయాన్ని దేవాలయ శాఖ కమిషనర్ కు తెలియజేయండి. మేము కూడా సిఫారసు చేస్తాం.

4. వెంకటరమణ – నెల్లూరు

ప్ర‌శ్న : సుదర్శన సత్రంలో మరుగుదొడ్లు సరిగా లేవు.

ఈవో : ఈ సత్రాలు 60 సంవత్సరాల క్రితం నిర్మించారు. బోర్డు నిర్ణయం మేరకు మరో మూడు సంవత్సరాల్లో కొత్తవి నిర్మిస్తాం.

5. చక్రవర్తి – త‌ణుకు

ప్ర‌శ్న : అంగప్రదక్షిణ టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వండి.

ఈవో : అంగప్రదక్షిణ టికెట్ల కోటా పరిమితంగా ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఎక్కువమంది క్యూలో వేచి ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కావున ఆన్లైన్‌లో బుక్ చేసుకోండి.

6. శశి – తెలంగాణ

ప్ర‌శ్న : అలిపిరి న‌డ‌క‌ మార్గంలో చిరుతల నుండి భక్తులకు రక్షణ కల్పించేందుకు ఫ్లైఓవర్ నిర్మించండి.

ఈవో : నడకదారి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వాలి. అటవీశాఖ సూచించిన మేరకు టీటీడీ తగిన చర్యలు చేపడుతుంది.

7. సత్యనారాయణ – కరీంనగర్

ప్ర‌శ్న : తిరుమలలో ఉచిత బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. బస్సులను పెంచండి.

ఈవో : ఉచిత బస్సులను పెంచేందుకు ప్రయత్నిస్తాం.

8. మోహన్ కృష్ణ – కడప

ప్ర‌శ్న : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు 300 దర్శనం టికెట్లు తీసుకున్నా ఎక్కువ దూరం నడవాల్సి వ‌స్తోంది. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో తోపులాట ఎక్కువగా ఉంటోంది.

ఈవో : మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు డాక్టర్ సర్టిఫికెట్ తో వస్తే బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి పంపుతాం. వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందరికీ దర్శనం చేయించాల్సి ఉంటుంది కావున క్యూలైన్లలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

9. ఉదయశ్రీ – హైదరాబాద్

ప్ర‌శ్న : ఆన్ లైన్ లో సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవ‌డం తెలియడం లేదు.

ఈవో : ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం తెలియని వారు తిరుపతిలో టైంస్లాట్ దర్శన టోకెన్లు పొందవచ్చు. అదేవిధంగా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

10. రామకృష్ణ – హైదరాబాద్

ప్ర‌శ్న : తిరుమలలో గదులు దొరకడం లేదు.

ఈవో : తిరుమలలో 50 వేల మంది భక్తులకు సరిపడా వసతి ఉంది. లక్ష మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ గదులు దొరకడం సాధ్యం కాదు. తిరుపతిలో కూడా వసతి పొందవచ్చు.

11. రాహుల్ – వరంగల్

ప్ర‌శ్న : 300 రూపాయలు దర్శనం టికెట్లు మూడు నెలల ముందు రిలీజ్ చేస్తున్నారు. ఒక నెల ముందు విడుదల చేస్తే బాగుంటుంది.

ఈవో : ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు మూడు నెలల ముందుగా ఆన్లైన్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నాం.

12. గోవిందస్వామి – ధర్మగిరి

ప్ర‌శ్న : 40 ఏళ్ల క్రితం ల‌డ్డూ నాణ్య‌త బాగుండేది. ప్ర‌స్తుతం కలకండ శాతం ఎక్కువైంది. భక్తులు సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మెయిల్ ఐడి ఇవ్వండి. డయల్ యువర్ ఈవో నిడివి పెంచండి.

ఈవో : 40 ఏళ్ల క్రితం తక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేసేవారు. ఇప్పుడు రోజుకు ఐదు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాం. శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు వంశపారంపర్యంగా ల‌డ్డూలు తయారీ చేస్తున్నారు. నాణ్య‌త పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఒక గంట మించి ప్రసారం చేయడం సాధ్యం కాదు. టీటీడీ వెబ్సైట్లో అధికారుల ఈమెయిళ్లు ఉన్నాయి. భక్తులు కాల్ సెంటరుకు కూడా ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.

13. మురళీధర్ – కొత్తగూడెం

ప్ర‌శ్న : శ్రీవారి ఆలయంలో కొందరు భద్రతా సిబ్బంది అసభ్యంగా మాట్లాడుతున్నారు.

ఈవో : విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. భక్తులు ఇలాంటి వారిని గుర్తించినప్పుడు వెంటనే అక్కడున్న ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరుతున్నాం.

14. శ్రీనివాస్ – హైదరాబాద్

ప్ర‌శ్న : శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు గదులు కూడా ఇవ్వండి.

ఈవో : ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు గదులు కేటాయిస్తున్నాం. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు తిరుపతిలో కూడా గదులు పొందవచ్చు.

15. లక్ష్మీ – బాపట్ల

ప్ర‌శ్న : ఆదిశేషు విశ్రాంతి గృహంలో ఉన్న డోనార్ సెల్‌ గురించి ఎక్కువమందికి తెలియడం లేదు. శ్రీవారి ఆలయ సమీపంలో పెట్టండి.

ఈవో : నూతన పరకామ‌ణి భవనం వద్ద త్వరలో డోనార్ సెల్‌ను ఏర్పాటు చేస్తాం.

16. కృష్ణ – అనకాపల్లి

ప్ర‌శ్న : అన్నప్రసాదం ముద్దగా ఉంటోంది. నాణ్యత పెంచండి.

ఈవో : అన్నప్రసాద విభాగంలో రెండేళ్లుగా టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేస్తున్నాం. నాణ్యత తగ్గిందని గుర్తించాం. ప్రస్తుతం రైస్ మిల్లర్ల నుండి బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. నిపుణులైన సిబ్బందిని తీసుకుని మ‌రింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తాం.

17. ప్రసాద్ – నెల్లూరు

ప్ర‌శ్న : తెలుగు పంచాంగం క్యాలెండర్లు త్వరగా అయిపోతున్నాయి.

ఈవో : మరిన్ని ముద్రించేందుకు చర్యలు తీసుకుంటాం.

18. లక్ష్మీ – నెల్లూరు

ప్ర‌శ్న : శ్రీవారి ఆలయంలో చిన్న లడ్డు ఇస్తున్నారు. అన్నప్రసాదాలు కూడా ఇవ్వండి.

ఈవో : అన్నప్రసాదాలు అయిపోయినప్పుడు చిన్న లడ్డూ ఇస్తున్నాం.

19. సురేష్ – ఈరోడ్

ప్ర‌శ్న : శ్రీవారి ఆర్జిత సేవ‌లు, దర్శన టికెట్లు బుకింగ్‌లో ఫొటో అప్‌లోడ్‌ చేసే విధానాన్ని ప్రవేశపెట్టండి.

ఈవో : పరిశీలిస్తాం.

20. రామారావు -తణుకు

ప్ర‌శ్న : దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరుమలలో శ్రీవారి దర్శనం, ఇతర సౌకర్యాలు చాలా బాగున్నాయి.

ఈవో : ధన్యవాదాలు.

21. రిషి – రాజమండ్రి

ప్ర‌శ్న : స్వామివారి కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, నెయ్యి దేశవాళీ గోవులతో తయారు చేయించండి.

ఈవో : ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ప్రస్తుతం 200 దేశవాళి గోవుల‌ను సమకూర్చుకున్నాం. మరో 400 గోవులను సమకూర్చుకోవడానికి చర్యలు చేపట్టాం. స్వామివారి కైంకర్యాలకు రోజుకు 60 కిలోల నెయ్యి అవసరమవుతోంది.

22. బసవరాజు – బళ్లారి

ప్ర‌శ్న : శ్రీవారి సేవలో ఏడు రోజుల స్లాట్ మాత్రమే ఉంది. మూడు, నాలుగు రోజుల స్లాట్ ప్రవేశపెట్టండి.

ఈవో : శ్రీవారి సేవకు భక్తుల నుండి డిమాండ్ ఎక్కువగా ఉంది. మూడు, నాలుగు రోజుల స్లాట్ వల్ల సేవకులు అవగాహన పెంచుకోవడం కష్టం అవుతుంది. ఈ కారణంగా ఏడు రోజులు స్లాట్ పెట్టడం జరిగింది.

23. రామశేఖర్ రెడ్డి – సత్యసాయి జిల్లా

ప్ర‌శ్న : కొందరు ప్ర‌యివేటు వ్యక్తులు గోవిందనామాలను మిక్స్ చేసి వాటి పవిత్రతను దెబ్బతీస్తున్నారు.

ఈవో : ఈ విషయంలో టీటీడీ తరఫున ఏం చేయాలో ఆలోచిస్తాం.

24. కుమారస్వామి – పాకాల

ప్ర‌శ్న : మొబైల్ డిపాజిట్ కౌంటర్ల వద్ద సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు.

ఈవో : ఈ విషయమై వివిధ విభాగాల్లోని సిబ్బందికి తరచూ సూచనలు ఇస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. చర్యలు తీసుకుంటాం. భ‌క్తులెవ‌రూ సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.

25. కమల శేఖర్ – బెంగళూరు

ప్ర‌శ్న : మేము విష్ణుసహస్రనామ పారాయణానికి వస్తుంటాం. దర్శనం, వసతి కల్పించండి. లడ్డూల్లో యాలకులను పొడిగా చేసి వినియోగిస్తే బాగుంటుంది.

ఈవో : విష్ణుసహస్రనామ పారాయణం చేసేవారు ముందుగా ఆన్లైన్లో దర్శనం, వసతి బుక్ చేసుకుని రావాలని కోరుతున్నాం. లడ్డూలు తయారీకి సంబంధించి మీ సూచనలను పోటు సిబ్బందికి తెలియజేస్తాం.

26. ప్రసాద్ – మార్కాపురం

ప్ర‌శ్న : సిఆర్ఓలో ఒకే చోట గదుల‌ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ర‌ద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇదివరకు లాగా నాలుగైదు ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టండి.

ఈవో : ఈ విషయాన్ని పరిశీలిస్తాం

 

 

Tags:

Post Midle