Date:17/04/2018
విశాఖపట్నంముచ్చట్లు:
జిల్లా పరిషత్తుకు రూ.కోట్లలో ఆస్తులున్నా.. ఆదాయం మాత్రం సున్నాయే. ఆక్రమణలతో విలువైన ఆస్తులు అన్యాక్రాంతమువుతున్నా.. వాటిని సంరక్షించే వారే కరవయ్యారు. కోర్టు వివాదాల్లో చిక్కుకుంటున్నా.. వాటిపై చిత్తశుద్ధితో పోరాడేవారే లేకపోయారు. పాలకవర్గాలు పైసలొచ్చే పనుల కోసం పాకులాడడమే తప్ప ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఏటా జడ్పీ ఆస్తులు కరిగిపోతున్నాయి.. అక్రమార్కుల చేతుల్లో చిక్కిపోతున్నాయి. సొంత ఆస్తులుండీ చిన్నచిన్న అవసరాలకు కూడా సర్కారుపైనే ఆధారపడాల్సి వస్తోంది.జిల్లా పరిషత్తుకు సుమారు రూ.1347 కోట్ల ఆస్తులున్నాయి. జడ్పీ కార్యాలయం, అతిథిగృహాలు, ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూములు, ఉన్నత పాఠశాల స్థలాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయ భవనాల రూపంలో స్థిరాస్తులున్నాయి. వీటిలో కొన్ని భవనాలు వినియోగానికి పనిరాని స్థితికి చేరుకున్నాయి. గత పాలకవర్గాలు పట్టించుకోకపోవడంతో వీటి వివరాలు కూడా జడ్పీలో దొరకని పరిస్థితి నెలకొంది. ఆస్తులతో జడ్పీకి వస్తున్న ఆదాయం ఒక శాతం కూడా లేకపోవడం విశేషం. ఆదాయమొచ్చే ఆస్తులన్నీ ఆక్రమణల చెరలోకి చిక్కుకుంటే.. ఆదాయం ఇవ్వని ఆస్తుల నిర్వహణకు అదనంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది.జడ్పీ పరిధిలో రూ.1300 కోట్ల పైబడి ఆస్తులుంటే.. అందులో సుమారు రూ.200 కోట్ల పైబడి ఆస్తులు ఆక్రమణల్లోనే ఉన్నాయి. ఏళ్ల తరబడి నిరాదరణకు గురవ్వడంతో విలువైన ఆస్తులన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని న్యాయస్థానాల పరిధిలో ఉంటే మరికొన్ని అక్రమార్కుల చేతుల్లో చిక్కుకున్నాయి. జిల్లా పరిషత్తు గద్దెనెక్కిన పాలకులు వీటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతమంది ఆక్రమణదారులతో చేతులు కలిపి వాటిని సొంత ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఆక్రమణల పాలైనవాటిలో నగర పరిధిలో భూములే ఎక్కువ ఉన్నాయి. రూ.కోట్లలో విలువచేసే ఈ భూములను వెనక్కి రాబట్టగలిగితే జడ్పీ నిధుల కోసం సర్కారుపై ఆదారపడాల్సిన అవసరం ఉండదు. ఆక్రమణల్లో కొన్ని ఇలా..విశాఖ నగరంలోని మర్రిపాలెంలో రూ.9.7 కోట్ల విలువైన 50 సెంట్ల స్థలం ఆక్రమణలో ఉండగా ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. సింహాచలం రైల్వేస్టేషన్‌కు సమీపంలో 1.09 ఎకరాల్లో జడ్పీ చౌట్రీని స్థానికులు ఆక్రమించుకున్నారు. దీని విలువ రూ.23.78 కోట్లుంటుందని అంచనా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు చెందిన కొన్ని స్థలాలు ఆక్రమణలకు గురయినా వాటిని గుర్తించలేదు..గొలుగొండ మండలం చీడిగుమ్మలలో పాఠశాల స్థలాన్ని స్థానికులు ఆక్రమించేశారు. ఇలా జిల్లా అంతటా జడ్పీ పరిధిలో ఉన్న ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నా వాటి సరంక్షణ మాత్రం కానరావడం లేదు.గత పాలకవర్గాలకు భిన్నంగా ప్రస్తుత జడ్పీ అధ్యక్షురాలు లాలం భవాని జిల్లా పరిషత్తు ఆస్తులను గుర్తించి వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడానికి చొరవ చూపించారు. జిల్లా మొత్తంగా ఉన్న ఆస్తులనైతే గుర్తించారు. వాటి సరంక్షణకు అవరసరమైన నిధులను వెచ్చించే స్థితిలో జడ్పీ లేకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఖాళీ స్థలాల రక్షణ గోడలు నిర్మించడం.. శిథిల స్థితిలో ఉన్న ఆస్తులను తిరిగి వినియోగంలోకి తెచ్చేలా మరమ్మతులు చేయడానికి.. కోర్టు వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులపై న్యాయపరంగా పోరాడడానికి సుమారు రూ.5.6 కోట్లు అవసరం అవుతాయని గుర్తించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ఇదివరకే ప్రభుత్వానికి, సంబంధిత మంత్రికి జడ్పీ నుంచి లేఖలు రాశారు. కనీసం జడ్పీ ఆస్తులను లీజుల ద్వారాగాని, బీవోటీ పద్ధతిలోనైనా అభివృద్ధి చేస్తే జడ్పీకి రూ.కోట్లలో ఆదాయం వస్తుందని దీనికైనా అనుమతి ఇవ్వాలని ఓ ప్రతిపాదన పెట్టారు. వీటికి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చేసేది లేక ఆస్తుల గుర్తింపుతోనే సరిపెట్టేసుకోవాల్సి వచ్చింది.
Tags:What are the assets …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *