కోట్లు ఖర్చు చేసి ఏం లాభం? (తూర్పుగోదావరి)

What are the benefits of costing crores? (East)

What are the benefits of costing crores? (East)

Date:13/10/2018
కాకినాడ ముచ్చట్లు:
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు అండగా నిలవాల్సిన ఈ కేంద్రాలు గతి తప్పుతున్నాయి. వీరికి పౌష్టికాహారం పంపిణీకి ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పర్యవేక్షణ లోపం.. సిబ్బంది బాధ్యతారాహిత్యం తదితర కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకున్నాయి.
జిల్లాలో మండలాలు, నగరాలు, పట్టణాల్లోనూ ఐసీడీఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సౌకర్యాల లేమితో పాటు నిర్వహణలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,546 ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా కేవలం 2,140 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. దీంతో పరాయి పంచన అరకొర సౌకర్యాల నడుమ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడానికి సిబ్బంది కొరత కొంత కారణంగా కనిపిస్తోంది. ప్లే స్కూళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దాలన్న సంకల్పం నెరవేరడం లేదు. అన్ని కేంద్రాలకు సొంత భవనాలు, విద్యుత్తు, తాగునీరు, ఫ్యాన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.
ప్రతి కేంద్రం పరిధిలోనూ జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)తో కలిసి పోషకాహార వనాలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉన్నా ఇదీ సరిగా అమలు జరగడం లేదు. పుట్టిన బిడ్డ 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో ఉండటం వల్ల శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గర్భం దాల్చిన క్రమంలో తల్లికి సరైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందక మాతృమరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండింటినీ అధిగమించాలంటే ప్రభుత్వం కేటాయిస్తున్న పౌష్టికాహారం సమర్థంగా అందాలి.కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో దస్త్రాల్లో చూపుతున్న హాజరుకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో సరకులు పక్కదారి పట్టేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అందించే సరకుల్లో బియ్యం, పప్పు, నూనె పౌర సరఫరాల సంస్థ నుంచి సరఫరా అవుతున్నాయి.
కోడి గుడ్లు, పాలు, కూరగాయలు రాష్ట్రస్థాయిలో కమిషనర్‌ నిర్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి అందుతున్నాయి. దీంతో గుడ్లు చిన్నవి వచ్చినా..కూరగాయలు నాసిరకంగా ఉన్నా.. పాలు పాడవుతున్నా జిల్లా అధికారులకు దీనిపై అజమాయిషీ లేకుండా పోతోంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న గుడ్లు నిర్దేశిత బరువు 50 గ్రాములు ఉండాలి.కానీ అతి తక్కువ పరిమాణంతో ఇవి ఉంటున్నాయి. దీనికితోడు అన్నం, పప్పు, కూరలు నిర్దేశిత పరిమాణంలో అందుతోందా..? లేదా..? అనేది పర్యవేక్షించే వ్యవస్థ లేదు.
కొన్నిసార్లు కుళ్లిన కోడిగుడ్లు, కూరగాయలు దర్శనమిస్తున్నాయి.పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వ ఉంటున్న పప్పుదినుసులు, ఇతర సామగ్రి కూడా బూజుపట్టి పోతున్నాయి. వీటినే మెనూకు వినియోగిస్తున్నారు.  గర్భిణులకు ఐరన్‌ అనుబంధ ఆహారం అందించడం, పిల్లల మానసిక ఎదుగుదల పర్యవేక్షించడంతో పాటు పిల్లలు పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వరకు వారిని పర్యవేక్షించాల్సిన అంగన్‌వాడీ వ్యవస్థలో లోపాలు సరిచేస్తే పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది.
Tags:What are the benefits of costing crores? (East)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *