ప్రభోదనంద ఆశ్రమంలో ఏం జరుగుతోంది
Date:17/09/2018
అనంతపురం ముచ్చట్లు:
తాడిపత్రి సమీపంలోని స్వామి ప్రబోధానంద ఆశ్రమం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవరికీ అంతగా తెలియని ఈ అశ్రమం రెండు రోజుల కిందట వార్తల్లోకి వచ్చింది. ప్రబోధానంద భక్తులు పెద్ద సంఖ్యలో అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి పూజలు, ప్రార్థనలు చేస్తారనేది బయట ప్రపంచానికి తెలిసిన విషయం. అయితే, బయటకు తెలియని అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి.
చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాల్లో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. నిమజ్జనం కోసం వినాయకుడి విగ్రహాలను తమ ఆశ్రమం మీదుగా తరలించవద్దంటూ ప్రబోధానంద శిష్యులు పెద్దపొలమడ గ్రామస్థులను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఇది క్రమంగా పెరిగి ఇరువర్గాలూ దాడిచేసుకునే స్థాయికి వెళ్లింది. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అతి కష్టమ్మీద లోపలికి ప్రవేశించిన సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కొన్నేళ్ల కిందట చిన్నపొలమడ వద్ద ప్రబోధానంద ఆశ్రమం ఏర్పాటుకాగా, యోగీశ్వరులు తమ గురువని భక్తులు చెబుతుంటారు.
అయితే ఆయనను ఎవరూ చూసిన దాఖలాలు లేవట. ఈయనకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా భారీగా భక్తులు ఉన్నారు. వీళ్లు శ్రీకృష్ణుడే తమ దైవమని భావించి, త్రైత సిద్ధాంతం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. గురువు ఏం చెబితే భక్తులు దానినే పాటిస్తారు. ప్రతి పౌర్ణమి రోజు ఈ అశ్రమంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇటీవల నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోనూ భారీగానే భక్తులు పాల్గొన్నారు.
ప్రతి నెలా ప్రార్థనలకు వచ్చేవాళ్లే కాకుండా శాశ్వతంగా 350-400 మంది వరకు అక్కడే నివాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ పూజలు మాత్రమే నిర్వహిస్తారని చెబుతున్నా, ఇతరులు ఎవరినీ ఆశ్రమంలోకి అనుమతించకపోవడం అనేక సందేహాలను తావిస్తోందని అధికారులు అంటున్నారు. విశాలమైన నాలుగు అంతస్తుల భవంతిలో చాలా గదులు, నివాస ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని హాళ్లలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిపైనే ప్రబోధానంద ప్రసంగాలను భక్తులను చూపిస్తారట.
వాటిని ప్రచురించేందుకు వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రింటింగ్ యూనిట్ కూడా లోపల ఏర్పాటు చేయడం విశేషం. కొందరు కుటుంబాలతో సహా ఇక్కడే నివసిస్తుండగా, ఆశ్రమంలో ఉండేదుకు వారి దగ్గర కొంత మొత్తం వసూలుచేస్తుంటారు. ఈ ఆశ్రమం చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చి, ప్రైవేటు సెక్యూరిటీని నియమించారు. అలాగే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్ వ్యవస్థ కూడా ఉంది. ఆశ్రమంలోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లను కూడా సిద్ధంగా ఉంచినట్టు అధికారులు గుర్తించారు.
Tags:What is happening in the ashram of the Prabhudananda