బీమాపై ఏది ధీమా?

Date:15/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
కొన్నిరోజుల క్రితం అకస్మాత్తుగా కురిసిన వండగళ్ల వానకు నిజామాబాద్ జిల్లాలోని పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు వ్యవసాయక్షేత్రాలను పరిశీలిస్తున్నారు. దీంతో పంట బీమాపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. కానీ.. ఈ బీమా ఎప్పుడు ఎంత మొత్తంలో అందుతుందన్న విషయమై స్పష్టత లేకుండా ఉంది. ప్రధానమంత్రి ఫసల్‌బీమాతోపాటు వాతావరణ ఆధారిత బీమాను రైతు అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా, రైతు, పాడిపశుసంపద, వాడే పనిముట్లకు ఎలాంటి హాని జరిగినా పరిహారం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఏడాదిన్నర క్రితం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ స్కీమ్ సత్ఫలితాన్నిచ్చింది. ఈ ప్రయత్నం సఫలం కావడంతో దీనిని రాష్ట్రంలోని మరో పదిజిల్లాలో ఈ ఏడాది అమలు చేశారు. కానీ నిజామాబాద్‌ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ పథకాన్ని జిల్లాకు కేవలం పత్తి పంటకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇలాంటి పథకం అన్ని పంటలకు ఉండి, జిల్లాకు వర్తిస్తే ఇప్పుడు కురిసిన వడగళ్లతో నష్టపోయిన రైతులకు కొంత మేలు జరిగేది.
వడగళ్ల వాన వల్ల సంభవించిన పంటనష్టానికి పరిహారం అందుతుందని ఏ రైతూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అసలు వస్తుందా..? వస్తే బీమా పరిహారం ఇస్తారా..? అనే సందగ్ధత వారిలో నెలకొంది. పంట రుణం తీసుకునేటప్పుడు ప్రీమియం కట్టడం, కట్టించుకోవడం వరకే తెలుస్తోంది. కానీ పరిహారం ఎంత లభిస్తుంది? ఎవరికి వస్తుంది? అనే అంశాలపై స్పష్టత లేదు. ఇదిలాఉంటే ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంపై రైతులకు అంతగా అవగాహన లేదు. నిజానికి ఈ పథకం కొండంత అండగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలీడం లేదు. సాగు చేసిన పంటపైనే రుణం తీసుకుంటే కచ్చితంగా నష్టపోయిన 48 గంటల్లో సంబంధిత కంపెనీకి మెయిల్‌ ద్వారానైనా, ఫోన్‌ ద్వారానైనా సమాచారమందిస్తే ఫిర్యాదు నమోదు అవుతుంది. వెంటనే బీమా కంపెనీ ప్రతినిధులు వచ్చి నష్టపోయిన ప్రభావిత ప్రాంతాలను తిరిగి పంచనామా చేసి నివేదిస్తారు. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పంట నష్టపోయిన రైతులందరికీ బీమా అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అందించే ఆర్ధిక చేయూతపై అవగాహన కల్పించాలని అంతా కోరుతున్నారు.
Tags; What is insurance on insurance?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *