జీవాలకు రక్షణేదీ..?  (నల్గొండ)

Date;28/02/2020
;

జీవాలకు రక్షణేదీ..?  (నల్గొండ)

నల్గొండముచ్చట్లు:

 

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ లో భాగమైన నాగార్జునసాగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కోర్‌ ఏరియాలో జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనివార్యంగా మారింది. గతంలో పోలిస్తే జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఫిబ్రవరి మాసంలోనే ఎండలు మండిపోతుండడంతో తాగునీటికి మూగజీవాలు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.  పలురకాల జంతువులు అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నప్పటికీ పులుల జాడ మాత్రం కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పులులు తిరగడంతో టైగర్‌వ్యాలి అనే పేరున్న లోయ కూడా ఉంది. నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో దేవరకొండ, నాగార్జునసాగర్‌ కంబాలపల్లి రేంజ్‌లలో కలిపి 41వేలహెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. అభయారణ్యమంతా సాగర్‌ జలాశయంతీరం వెంట ఉంది. దేవరకొండ రేంజ్‌లో 26,785హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 30కెమెరాల ద్వారా 20కి పైగా చిరుతలు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అడవిలో
మనుబోతులు, దుప్పులు, కణితులు, ఎలుగుబంట్లు చౌసింగ, సింకార,  రేస్‌కుక్కలు, హైనాలు, మూసిక జింకలు, నెమల్లు తదితర జంతువుల సంఖ్య  ఊహించని రీతిలో పెరిగినట్లుగా  అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు ముందస్తుగానే మేల్కొ ని వాటిని  అరికట్టాల్సిన అవసరం ఉంది. గతంలో అటవీ ప్రాంతంలోకి జీవాలు రాకుండా కందకాలు తవ్వడంతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆ కందకాల్లో చెత్తా చెదారం  పేరుకుపోయింది. అటవిని ఆనుకుని ఉన్న తండాల ప్రజలు ఎవరైన సిగరెట్, బీడీ పీకలు పడేసిన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా అధికారులు సమీప  తండాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

 

Tags;What is life? (Nalgonda)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *