Natyam ad

ఖర్గేకు నల్లేరు మీద నడక ఏం కాదు

అమరావతి ముచ్చట్లు:

తొమ్మిది సార్లు కర్నాటక శాసన సభకు, రెండు సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికై కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి, 80వ పడిలో పడిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఆ పార్టీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని తెరిచింది. 20 ఏళ్ళ పైబడిన సుదీర్ఘ వ్యవధి తర్వాత గాంధీల కుటుంబేతరులు కాంగ్రెస్ పగ్గాలు మళ్ళీ చేపట్టడం, ఖర్గే ఆ పార్టీ అధ్యక్ష పీఠంపై కూచున్న మూడో దళిత నేత కావడం చెప్పుకోదగ్గ విశేషాలు. గతంలో దామోదరం సంజీవయ్య, జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా పని చేశారు. అయితే ఖర్గే కాంగ్రెస్‌కు ఎటువంటి సారథ్యాన్ని అందిస్తారనేది అమిత ఆసక్తికరం. ఎందరు అసమ్మతి వాదులు ఎన్ని విమర్శలు చేసినా కింది నుంచి పై వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పటికీ గాంధీల కుటుంబాన్నే అంటిపెట్టుకొని వున్నారన్నది కాదనలేని వాస్తవం. అది ఖర్గే ఎన్నిక ఘట్టంలో మరోసారి నిరూపణ అయింది. గాంధీల కుటుంబమే ఆ పార్టీకి ఏకైక అధిష్టాన అయస్కాంతం అయినప్పటికీ కిందనున్న వివిధ శ్రేణుల్లో అంతర్గత ఎన్నికల నిర్వహణ, క్రమ శిక్షణ వంటివి లోపించి చాలా కాలమైంది. ఈ లోపాలను సరిదిద్దవలసిన బాధ్యత ఇప్పుడు ఖర్గేపై పడింది. గాంధీల ప్రాబల్యం పొల్లుపోకుండా కొనసాగుతున్న పార్టీకి అధ్యక్షుడుగా ఖర్గే పాత్ర పరిమితమైనదే. దానిని అంగీకరిస్తూనే ఆయన ఆ పార్టీని రానున్న అనేక యుద్ధాలకు సమాయత్తం చేయవలసి వుంది.

 

 

ఈ సత్యం ఖర్గేకి ఇప్పటికే అవగాహన అయింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల ఎరుకలోనే, వారి కనుసన్నలలోనే తన పాత్రను వీలైనంత సమర్థవంతంగా నిర్వహించి నిరూపించుకోవలసి వున్నదనే అవగాహనతోనే ఆయన అడుగులు పడతాయని బోధపడుతున్నది. మొన్న బుధవారం నాడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఖర్గే 47 మంది సభ్యులతో సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేంత వరకు దాని స్థానంలో ఈ సంఘం పని చేస్తుందని తెలుస్తున్నది.ఈ కమిటీలో సోనియా, రాహుల్ గాంధీలు కూడా సభ్యులుగా వున్నారు. భారతీయ జనతా పార్టీ పాలనలో దేశంలో వేళ్ళు తన్నుకొన్న అబద్ధాలు, విద్వేషం కూడిన వ్యవస్థ అంతు చూస్తానని ఖర్గే చేసిన ప్రతిజ్ఞ మెచ్చుకోదగినది. పార్టీకి కింది నుంచి పై వరకు కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా శిధిలమైన స్థితి నుంచి దానిని పునరుద్ధరించగలిగితే 138 ఏళ్ళ చరిత్ర కలిగిన అతి పురాతన కాంగ్రెస్ పార్టీపై ఖర్గే ముద్ర బలంగా పడుతుంది. అందుకు ఆ పార్టీలోని పరిస్థితులు ఆయనకు తోడ్పడవలసి వుంది. అధ్యక్ష ఎన్నికల్లో అధిష్టాన వర్గానికి ప్రియమైన అభ్యర్థిగా పోటీ చేస్తాడనుకొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇప్పటికీ రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని బహిరంగంగానే కోరుతున్నారు. అటువంటి శక్తులు ఖర్గేను దూరం పెట్టి గాంధీల కుటుంబం పట్ల విధేయత ప్రకటించడమే పనిగా వ్యవహరిస్తే అది నూతన అధ్యక్షుడికి ఇబ్బందికరంగానే వుంటుంది.వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్ విస్తృత సమావేశం ఖర్గే ఎన్నికను ఆమోదించవలసి వుంది. అది సునాయాసంగానే జరిగిపోతుంది.

 

 

 

Post Midle

ఆ తర్వాత వర్కింగ్ కమిటీ నియామకం జరగవలసి వుంటుంది. మొన్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆ కమిటీ సభ్యులందరూ రాజీనామా చేశారు. వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరిపించగలిగితే అది ఖర్గే కిరీటంలో తురాయి అవుతుంది. లోక్‌సభలో కేవలం 53 మంది సభ్యుల బలంతో అధికారం రెండు రాష్ట్రాలకే పరిమితమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాగా నీరసించిపోయి వున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రస్తుతానికి జాతీయ ప్రతిపక్షంగా అదే కొనసాగుతూ వుండడం మన రాజకీయాల డొల్లతనానికి నిదర్శనం. ప్రాంతీయ పక్షాలు ఎంత బలంగా వున్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఇంత వరకు ఎదగలేకపోయాయి. కాంగ్రెస్‌కు ఇంకా అవకాశాన్ని మిగుల్చుతున్నది. దీనిని ఉపయోగించుకొని ఆ పార్టీని ఖర్గే ఎంత వరకు పునరుజ్జీవింప చేస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరలో జరగనున్న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు ఆ తర్వాత జరగబోయే గుజరాత్ బ్యాలట్ సమరం ఖర్గేకు తక్షణ సవాళ్ళు కానున్నాయి. వచ్చే ఏడాది చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ పార్టీని మెరుగైన శక్తిగా నిరూపించగలగడం అదనంగా మరి కొన్ని రాష్ట్రాల్లోనైనా అధికారంలోకి తేగలగడం ఖర్గే నాయకత్వానికి అగ్నిపరీక్ష వంటివి. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా చేసిన ఆయనకు దేశ పరిస్థితుల పట్ల, వివిధ రాష్ట్రాల్లోని రాజకీయాల లోతుపాతుల పట్ల సమగ్ర అవగాహన వుంది. అందుచేత గాంధీల కుటుంబం బయటి అధ్యక్షుడుగా ఖర్గే కాంగ్రెస్‌కు మంచి నాయకత్వాన్నే అందించగలరని ఆశించవచ్చు.

 

Tags: What is not walking on the black for Kharge

Post Midle

Leave A Reply

Your email address will not be published.