పవన్ అజెండా ఏమిటీ

Date:16/03/2018
విజయవాడ ముచ్చట్లు:
అధికారమే జనసేన పరమావధి కాదు. 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా. ఓటు బ్యాంక్ రాజకీయాలకు జనసేన దూరం. ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం కానే కాదు. ఇలాంటి వ్యాఖ్యలు జనసేన అధినేత చేయడంతో అసలు ఈ పార్టీ పుబ్బలో పుట్టి మఖలో కలిసిపోతుందా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో నడిచేవి. ఏ అంశం మీద స్పష్టత ఇవ్వని పవన్ కళ్యాణ్ పార్టీ ఎదో ఒక పార్టీతో జత కట్టే ప్రయాణం సాగిస్తుందని ముఖ్యంగా టిడిపి 40 సీట్లు జనసేనకు కట్టబెడుతున్నట్లు ప్రచారాలు జోరుగా సాగాయి. గతంలో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ అని ఒకసారి… కాదు కాదు అని మరోసారి జనసేన పార్టీ వర్గాలు అస్పష్ట ప్రకటనలు ఇచ్చేవి. ఇక గత నాలుగేళ్లుగా స్వయంగా పవన్ కల్యాణే తాను ముఖ్యమంత్రి కావడం లక్ష్యం కాదని చెప్పడంతో సంబరపడ్డ చంద్రబాబు ఆయన కు రెడ్ కార్పెట్ పరిచేవారు. వైసిపి విపక్షం కాదని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర జనసేనే పోషిస్తుందంటూ చెప్పుకొచ్చేవారు.ఏపీలో విపక్షం ఎక్కడుంది ? పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక సూచనలతో వస్తున్నారు. విపక్షం అంటే ఆయనలా వుండాలంటూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆకాశానికి ఎత్తేసే వారు. ఇప్పడు పవన్ నేరుగా లోకేష్ అవినీతిని ఉతికి ఉతికి ఆరేశారు. తద్వారా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి భవిష్యత్తులో కాబోయే సీఎం అభ్యర్థిని నేరుగా టార్గెట్ చేశారు. అంతకుముందే వైసిపి అధినేతను 2014 నుంచి పవన్ టార్గెట్ చేస్తూ వచ్చారు. నాడు బిజెపి టిడిపి అలయన్స్ తో జట్టు కట్టడంతో వైసిపి అధినేత జగన్ పైన విమర్శలు చేసిన పవన్ ఆ తరువాత అధికారంలో టిడిపి వున్నా ఆ పార్టీపై ప్రేమనే చూపిస్తూ వచ్చారు.ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది. తన మరో ప్రధాన ప్రత్యర్థి లోకేష్ ను ఇప్పటి నుంచి టార్గెట్ గా పెట్టుకున్నారు పవన్. గుంటూరు సభలో నేరుగా చంద్రబాబు ను విమర్శించని పవన్ ఆయన పాలనను ఎండగట్టారు. ఆయన ఏకైక పుత్ర మాణిక్యం అవినీతి పరుడని ఐఎస్ ఐ మార్క్ వేసి మరీ ముద్ర పడేశారు. అలా ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు మచ్చలున్న వారని తానే స్వచ్ఛమైన లీడర్ ను అని ప్రజలకు అన్యోపదేశం చేశారు. తద్వారా 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన నుంచి పవన్ క్లిన్ ఇమేజ్ తో శంఖారావం పూరిస్తూ 175 స్థానాల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్లు స్పష్టత ఇచ్చేశారు. గుంటూరు సభతో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిని కానంటూ ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు తొలగించి జనసైన్యానికి క్లారిటీ ఇచ్చేశారు.
Tags: What is Pawan Agenda?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *