శ్రీకృష్ణదేవరాయల కొండవీటి శాసనంలో పేర్కొన్న కూరగాయల పేర్లేమిటి ?

అనంతపురం ముచ్చట్లు:
 
జామ మిరప ముల్లంగి వేరుశెనగ, పొగాకు, టీ, కాఫీ, నల్లమందు ( ఓపియం), గెనుసుగడ్డ (చిలకడదుంప),ఉల్లి (ఎర్రగడ్డ), వెల్లుల్లి ( తెల్లగడ్డ), బెండ, యాపిల్,జీడిపప్పు, అనాస (ఫైనాపిల్ ), అవకాడో, రాజ్మా, బీన్స్, క్యారట్, కాలిఫ్లవర్, గోబి, పామాయిల్, కాప్సికమ్, సొరకాయ, పుచ్చకాయ, మొదలైన కాయలు పండ్లు కూరగాయలు మనవి కాదంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు కదా!నమ్మాలి. ఇందులో చాలావరకు కాయలుపండ్లు పోర్చుగీసు వారి రాకతో భారతదేశంలో పంటలుగా మారాయి. ఉదా॥ మిరప, పొగాకు, బొప్పాయి, వేరుశెనగ,అనాస, బంగాళాదుంప మొదలైనవి. మరికొన్నింటిని బ్రిటన్, ఫ్రెంచి, డచ్ మొదలైనదేశాల వర్తకులు మనదేశంలో ప్రవేశపెట్టారు. కొన్ని విదేశీయుల రాకతో మనవిగా మారగా మరికొన్ని జీవనానికి మనిషి వలసవెళ్ళినపుడు తనతో పట్టుకుపోవడం జరిగింది. ఉదా॥ అన్ని రకాల సొరకాయలకు జన్మస్థానం ఆఫ్రికా కాగా, అవి కొన్ని వేలసంవత్సరాల కిందటనే భారతదేశంలో ప్రవేశించాయి.అంతకుముందు మనదేశంలో దొరికేపండ్లు కూరగాయలతోనే మనవారు వంటలలో వాడి తినేవారు. ఒకసందేహం కలగవచ్చు, పోర్చుగీసువారు మిరపకాయలను ప్రవేశపెట్టారు కదా! అంతకుముందు మనవారు కారంలేకుండానే అన్నాన్ని తినేవారా అంటే అలా తినేవారు కాదు.కారానికి ఆరోగ్యానికి రారాజు మిరియాలు. ఆ మిరియాలను కారంకొరకు ఉపయోగించేవారు.
 
 
మనదేశంలోనున్న కాయలు పండ్లు కూరగాయలు ఆకుకూరలేమిటో చూద్దాం.
మిరియాలు, ఏలకులు, లవంగాలు, పసుపు, ఆవాలు(సాసువులు) జీలకర్ర, దోస, వంకాయ, గుమ్మడి, ద్రాక్ష, చెరకు, దానిమ్మ, దోస, కొబ్బరి, అల్లం, శొంఠి, కంద, గురుగు, చెంచలి, పాలవాకు, గాదిరాకు, దిరిశాకు, అవిస, చింతాకు, పెసలు, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, బియ్యం, గోధుమలు, బార్లీ, సజ్జ, కొర్ర, సాములు, అనప( సొరకాయ కాదు, ఇదో పప్పుధాన్యం), కాకర, చింతపండు మామిడి మొదలైనవి.మనపూర్వీకులు వుపయోగించిన కొన్నింటి కాయలను మనము పూర్తిగా వదిలేశాము. ఏవి మనవో మనవికాదో తెలుసుకోలేనంతగా కొన్ని మన ఆహారసంస్కృతిలో కలిసిపోయాయి.క్రీడాభిరామమనే గ్రంధాన్ని వినుకొండ వల్లభరాయుడు వ్రాశాడని కాదు శ్రీనాథుడు వ్రాశాడని కొందరి వాదం. ఎవరు వ్రాస్తేనేమి అందులో మంచినశర్మ టిట్టిభసెట్టి అనేవారు ఇద్దరు మంచిమిత్రులు. ఓరుగల్లు నగరాన్ని చూడటానికి వెళ్ళి, నగర అందాలను అస్వాదించి పూటకూళ్ళ ఇంటిలో ఒకరూకకే తాము మృష్టాన్న భోజనాన్ని ఏయే పదార్థాలతో తిన్నది సవివరంగా వివరించారు.ఇక పల్లెటూరి భోజనం ఎలావుంటుంది అందులో ఏయే ఆకుకూరలు వాడారోనన్న సంగతిని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో “గురుగున్ జెంచలి లేత దిరిశాకు…..” అనే పద్యంలో చక్కగా వివరించాడు.
 
శ్రీకృష్ణదేవరాయుడంటే గుర్తుకు వచ్చింది.
2.5.1520 నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో సాళువతిమ్మరుసు (అప్పాజీ) మేనల్లుడైన నాదెండ్ల గోపర్సయ్యగారు కొండవీడు పాలకుడిగా వున్నపుడు అక్కడి, యజ్ఞవాటికా రఘునాథదేవాలయానికి శిఖరం కట్టించి, దేవాలయానికి సున్నం కొట్టించి, చుట్టూ ప్రాకారాలు కట్టించి,రాజగోపురంపై బంగారు కలశాలు ఎత్తించి, నిత్యనైవేద్యాలకు దూపదీప అమృతపడులకు దానాలు చేసి, నిత్యం దేవాలయంలో పూజలు నిర్విజ్ఞంగా జరగటానికిగాను మైదవోలు, వేంపల్లె (కడపజిల్లాలోనివి) దానంగా ఇచ్చి,ఇంకా నాడు కొండవీటి సంతలకు (మార్కెట్లకు) వచ్చేమామిడికాయలు, ఉసిరికలు, వంకాయలు, మినుములు, శనగలు, గోధుమలు, ఉలవలు, కందులు, రాగులు, నువ్వులు, ఆముదాలు, అనుములు, పత్తి, చింతపండు, కరక్కాయలు, ఉసిరికెపప్పు, కంద, చామ, చిరుగడం, ఉల్లి, పసుపు, గుగ్గిలం, మెంతి, జీలకర్ర, అల్లం, నిమ్మ, టెంకాయలు, బెల్లం, నేయి, ఇప్పపూవు, శొంఠి, ఉక్కుతో చేసిన ఉలులు, ఇనుము, సీసం, తగరం, రాగి, పంచధార, నూలు, తమలపాకులు, గందం, పిప్పలి, కరాంభువు, జాజికాయ, జాపత్రి,మొదలైన వాటిపై స్వల్పసుంకాలు విధించి గుడి నిర్వహణకు చెందాలని పేర్కొన్నాడు.ఉల్లి వెల్లుల్లి చీనాదేశంనుండి దాదాపు రెండువేల సంవత్సరాల కిందట భారతానికి వచ్చాయి. ఉల్లివెల్లుల్లి కామక్రోధాలను ప్రేరేపించే విదేశీదినుసులు కనుక గుప్తులకాలంలో అగ్రవర్ణాలు తినేవారు కాదని చైనా యాత్రికుడైన పాహియాన్ పేర్కొన్నాడు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: What is the name of the vegetable mentioned in the inscription of Sri Krishnadevarayala hill?

Natyam ad